ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి
గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రతి వైద్య అధికారి సమష్టి కృషి చేయాల్సిన అవసరం ఉందని గుంటూరు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీఎంహెచ్‌ఓ తన చాంబర్‌లో పలువురు వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలను సమీక్షించి వాటిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వైద్య అధికారులు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రంగారావు మాట్లాడుతూ ప్రత్తిపాడు, కొల్లిపర, పొన్నూరులలో నెలకు 50కి తగ్గకుండా ప్రసవాలు చేయాలని ఆదేశించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ గుంటూరు పట్టణంలోని ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు ఈడీడీ లిస్ట్ ప్రకారం గర్భిణులను, జీజీహెచ్‌కు కాన్పుకు పంపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ సౌభాగ్యవాణి, పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఫిరోజ్ ఖాన్, వైద్యులు డాక్టర్ రెహమత, డాక్టర్ ప్రియాంక, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి


