ఆక్రమిత స్థలంలో విద్యుత్ కనెక్షన్, మీటరు తొలగింపు
తాడికొండ: ‘సాక్షి’ వరుస కథనాలతో స్పందించిన అధికారులు తాడికొండ మండలం లాం గ్రామంలో టీడీపీ మైనార్టీ నాయకుడి చెరలో ఉన్న రూ. 20 కోట్ల భూమిలో ఎట్టకేలకు విద్యుత్ కనెక్షన్, మీటరు తొలగించారు. అయితే సదరు భూమి తనకు ఎలా సంక్రమించింది అనే దానిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినా.. ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఇది పక్కా మోసం అని ఇప్పటికే తేలింది. అయితే ఆ భూమిని తనకు మసీదు కమిటీ లీజుకు ఇచ్చారంటూ తప్పుడు పేపర్లు సృష్టించిన సదరు కూటమి నేతకు లీజు అగ్రిమెంటు చేసిన వ్యక్తులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోపోవడం, వారికి కనీసం నోటీసులు జారీ చేయకపోవడం విశేషం.
● రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ స్థలం అని ఏర్పాటు చేసిన బోర్డు కేవలం ఫొటోకే పరిమితం కాగా ఆ స్థానంలో నిమిషాల వ్యవధిలోనే ఇది మసీదుకు చెందిన స్థలం అంటూ సదరు నేత బోర్డు ఏర్పాటు చేసి ఎంచక్కా అక్రమ నిర్మాణాలు చేశాడు. ఇది కాస్తా రచ్చకెక్కడంతో ఆయన మరో పన్నాగానికి తెరలేపాడు.
● గతంలో అదే సర్వే నెంబరుపై తాను కోర్టులో వేసి 40 ఇళ్లు కూలదోయించిన 40 మందిని పిలిచి మేం రాజీ చేసుకున్నాం, మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు.. మీ ఇళ్లు మీరు కట్టుకోండి అని చెప్పడంతో అమాయకంగా బాధితులు ఆ స్థలంలో మళ్లీ నిర్మాణాలకు తెరలేపారు. సందట్లో సడేమియా అంటూ చిన్నా చితకా నాయకులు సైతం మళ్లీ ఆక్రమణల దందా ప్రారంభించడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరుకు కూతవేటు దూరంలో ఉండటం, ఇక్కడ భూముల ధరలకు భారీగా రెక్కలు రావడంతో తన అక్రమ నిర్మాణాన్ని కాపాడుకునేందుకు ప్రజలను రెచ్చగొట్టి మరోసారి బలిపశువులను చేస్తున్నాడని, సంబంధిత రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు ఇకనైనా స్పందించి ఆక్రమణలు నిలిపేయాలని పలువురు కోరుతున్నారు.
ఆక్రమిత స్థలంలో విద్యుత్ కనెక్షన్, మీటరు తొలగింపు


