ఉద్యోగోన్నతులు ఏవీ ?
● గుంటూరు జీజీహెచ్‌లో అధికారుల నిర్లక్ష్యం
●చిన్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు మీనమేషాలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న ‘చిన్న’ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు అధికారులకు ‘పెద్ద’ మనస్సు రావడం లేదు. ప్రమోషన్లు ఇస్తామని నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఆ తరువాత మిన్నకుండిపోతున్నారు. గత ఏడాది కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని జీజీహెచ్ అధికారులు రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఏడాది గడిచినా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్‌ల కాలపరిమితి దాటిపోయింది.
అంతా మా ఇష్టం...
జీజీహెచ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును భర్తీ చేసేందుకు ఆసుపత్రి అధికారులు 2025 ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన రెండు వారాల వ్యవధిలోనే ప్రమోషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును భర్తీ చేశారు. కానీ రికార్డు అసిస్టెంట్ పోస్టును ఆరేళ్లకుపైగా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సుమారు ఏడేళ్లకు పైగా ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి ఉద్యోగులు పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ పోస్టులను అర్హత ఉన్నా తమకు ఇవ్వడం లేదని కొంత మంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లడంతో జీజీహెచ్ అధికారులు పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు ఇస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. తాజాగా ఐదు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఏడాదిగా భర్తీ చేయలేదు. ఆస్పత్రిలో ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారు. దీంతో పలువురు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి ప్రమోషన్ పోస్టును దక్కించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటి చైర్‌పర్సన్ ఎ.తమీమ్ అన్సారియా ఈ విషయంపై దృష్టి సారించి ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్‌ల విషయంలో న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.
వివరణః
జీజీహెచ్‌లో రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని ప్రమోషన్‌ల ద్వారా త్వరలోనే నిర్వహిస్తామని ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ పూసల శ్రీనివాసరావు తెలిపారు.
నరసరావుపేట ఈస్ట్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం తెలిపారు. మొత్తం 19 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించి జిల్లా టీమ్‌లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల ఉద్యోగ క్రీడాకారులు కార్యాలయ గుర్తింపు కార్డు, ఇతర ధ్రువపత్రాలతో 12న స్టేడియానికి హాజరుకావాలని కోరారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19 నుంచి 22 వరకు విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నరసింహారెడ్డి తెలిపారు. వివరాలకు 8712622574 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


