వైభవంగా నృసింహుని గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో కార్తిక చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం బంగారు గరుడ వాహనంపై శ్రీ స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన నృసింహుడిని బంగారు గరుడ వాహనంపై అధిష్టింపజేసి రంగురంగుల పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారి గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ గ్రామోత్సవం దేవస్థానం నుంచి ప్రారంభమై మెయిన్ బజారు మీదుగా మిద్దె సెంటర్ వరకు చేరుకుని తిరిగి పెదకోనేరు మీదుగా దేవస్థానం వరకు కొనసాగింది. పురవీధుల్లో శ్రీవారిని భక్తులు దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ ఈవో కె. సునీల్‌కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


