ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించిన పలు డిగ్రీ, పీజీ కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను గురువారం ఇన్‌చార్జి రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, దూర విద్యా కేంద్రం ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు విడుదల చేశారు. డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం (జనరల్, కంప్యూటర్ అప్లికేషన్), బీబీఏ కోర్సుల 1, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించారు. అలాగే, ఎంఏ ఎకనామిక్స్ 1, 2, 3, 4 సెమిస్టర్ల, బీఎల్‌ఏఎస్సీ కోర్సుల 1, 2 సెమిస్టర్ ఫలితాలు విడుదల య్యా యి. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ కోర్సులకు ఒక్కో పేపరుకు రూ.770, పీజీ కోర్సులు ఒక్కో పేవరుకు రూ.960 నవంబరు 11వ తేదీలోగా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫలితాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు.
తెనాలి: ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న తెనాలిలో ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి సూతపురాణం శత వసంతాల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. స్థానిక కవిరాజు పార్కులోని వీజీకే భవన్‌లో ఉదయం 10 గంటలకు ఏర్పాటయ్యే సభకు ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ అధ్యక్షత వహిస్తారు. భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్/రచయిత రావెల సాంబశివరావు, మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షుడు బి.సాంబశివరావు సూతపురాణంపై ప్రసంగిస్తారు.


