కలేకూరి ప్రసాద్‌కు ఘన నివాళి
నెహ్రూనగర్: తెలుగు సమాజంలో దళిత ధిక్కార కవిగా, ప్రజా పాటల రచయితగా, దళిత విప్లవ ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, దళిత బహుజన సిద్ధాంత హక్కుల కోసం విప్లవ ఉద్యమ నాయకుడిగా ఎదిగి కవులకు, కళాకారులకు ఆదర్శంగా నిలిచిన గొప్ప కవి కలేకూరి ప్రసాద్ అని ప్రముఖ కవి అనిల్ డ్యానీ కొనయాడారు. శనివారం అరండల్‌పేటలోని యూటీఎఫ్ హాల్‌లో కలేకూరి జయంతి సభ చిన్నం డేవిడ్ విలియమ్స్ అధ్యక్షతన నిర్వహించారు. అనిల్ డ్యానీ మాట్లాడుతూ హిందూ మతోన్మాద, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన ఉక్కు మనిషి అని పేర్కొన్నారు. కారంచేడు ఉద్యమం నుంచి లక్ష్మీపేట పోరాటం వరకు క్రియాశీలకంగా అన్ని దళిత ఉద్యమాల్లో తన వంతు ఉద్యమ సహకారిగా కలేకూరి కొనసాగారని గుర్తు చేశారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌జే విద్యాసాగర్ మాట్లాడుతూ రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు రూపుమాపేందుకు తన రచనలతో సమాజాన్ని చైతన్యవంతులను చేసిన మహనీయుడుగా అభివర్ణించారు. సభా అధ్యక్షులు న్యాయవాది పాటిబండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల మీద ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందని అందుకు నిదర్శనం సీజేఐపై చెప్పు విసిరిన ఘటన, ఐపీఎస్ అధికారి ఆత్మహత్య వంటి ఘటనలే కారణమన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు దళితులంతా ఐక్యమత్యంగా పోరాడాలని అవసరం ఎంతైన ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, సాధు మాల్యాద్రి, సుదర్శి ప్రకాష్, పల్నాటి శ్రీరాములు, శిఖా సురేష్, వడ్డిముక్కల సురేష్, కనకవల్లి వినయ్, కూరపాటి మాణిక్యరావు, కట్టా నరసింహా, బత్తుల అనిల్, తాడిగిరి జయరత్నం, కొప్పుల సురేష్, రావినూతల కమలకుమారి పాల్గొన్నారు.


