గ్రామాలు, వార్డులకు దత్తత అధికారులను నియమించాలి
నగరంపాలెం: జిల్లాలోని ప్రతి గ్రామం లేదా వార్డుకు ఒక పోలీస్ అధికారి (కానిస్టేబుల్/హెడ్ కానిస్టేబుల్/ ఏఎస్‌ఐ)ని దత్తత అధికారిగా నియమించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గుంటూరు నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల (పీఎస్) అధికార, సిబ్బందితో శనివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వారానికి కనీసం రెండుసార్లు గ్రామాలు/వార్డులను సందర్శించాలని అన్నారు. స్థానికంగా నెలకొన్న గొడవలు, రాజకీయ వివాదాలు, రౌడీమూకల కార్యకలాపాలు తదితర అంశాలపై నిఘా ఉండాలని స్పష్టంచేశారు. విధి నిర్వహణలో లాఠీ, విజిల్ పోలీస్ సిబ్బంది వద్ద ఉండాలన్నారు. రౌడీమూకలతో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి వారం రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, హిస్టరీషీట్లు ఉన్న వారిని పీఎస్‌లకు పిలిపించాలని అన్నారు. తద్వారా వారి వివరాలు సేకరించి, హాజరు రికార్డులను సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని చెప్పారు. రాత్రి 11 గంటల తర్వాత అనవసరంగా సంచరించే వారిని పోలీస్‌స్టేషన్లల్లో కౌన్సెలింగ్ చేసి, వేలిముద్రలు సేకరించాలని అన్నారు. ప్రతి పీఎస్‌లో సైబర్ క్రైం, మహిళల భద్రత, గంజాయి/ రోడ్డు ప్రమాదాలు, చోరీలు ఇతరత్రా నేరాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు.
జాగ్రత్త వహించండి
సామాజిక మాధ్యమాలు వినియోగించే వారు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారాల్లో సమాచారం, పోస్టులు పంపించే ముందు ఒకట్రెండు సార్లు సరిచూసుకోవాలని అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య, నిరాధార సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇటువంటి పోస్టులు ప్రజల్లో విభేదాలు రేకెత్తిస్తాయని అన్నారు. అటువంటి వ్యక్తులను గుర్తించి, చట్టపరమైన విచారణ చేపడతామని చెప్పారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


