నాగులేరులో పడి విద్యార్థి మృతి
దాచేపల్లి: ప్రమాదవశాత్తు నాగులేరులో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డుకి చెందిన ఉద్దంటి నరేంద్ర కుమారుడు జగదీష్(10) ఈ ఘటనలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నరేంద్ర, మల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన జగదీష్ స్నేహితులతో కలిసి నాగులేరు వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాళ్లు కడుగుకుంటున్న క్రమంలో చెప్పులు నాగులేరులో పడ్డాయి. వాటిని తీసుకునే క్రమంలో పడిపోయి గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు జగదీష్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నాగులేరులో గాలించి జగదీష్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇప్పటి వరకు ఇంట్లో తమతో ఉన్న కుమారుడు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. జగదీష్ మృతదేహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.


