పెన్షన్ వాల్యుయేషన్ బిల్లుకు వ్యతిరేకం
లక్ష్మీపురం: పెన్షనర్ల ఉద్యోగ విరమణ తేదీ ప్రాతిపదికన విడదీసి వారికి వేతన సంఘాల లబ్ధిని నిరాకరించడానికి ఉద్దేశించిన కేంద్రం తీసుకొస్తున్న పెన్షన్ వాల్యుయేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రాఘవేంద్రన్ పేర్కొన్నారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆల్ ఇండియా పోస్టల్ అండ్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ ఐదో వార్షిక సమావేశాలు నిర్వహించారు. తొలుత యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బిల్లుకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. దీంతో ఈనెల16న సుప్రీంకోర్టులో దీనిపై కేసు వేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఢిల్లీ ఎన్నికల ముందు నియమిస్తున్నట్టు ప్రకటించినా పది నెలలు గడుస్తున్నా కూడా దానికి చైర్మన్‌ను ఇతర సిబ్బందిని ఇంతవరకు నియమించలేదని పేర్కొన్నారు. పెన్షన్ వాల్యుయేషన్ చట్టం రద్దు చేయటం సాధనకు పెన్షనర్స్ అసోసియేషన్స్ న్యాయపోరాటంతో పాటు మిగతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ పోస్ట్‌మెన్ మరియు ఎంటీఎస్ ఉపాధ్యక్షులు సిహెచ్.విద్యాసాగర్, ఏఐపీఆర్‌పీఏ ఆల్ ఇండియా నాయకులు దేవనాథ్ ప్రసంగించారు.
నూతన కమిటీ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాఖ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్రానికి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి ప్రెసిడెంట్‌గా నిమ్మగడ్డ నాగేశ్వరరావు, సెక్రటరీగా కె.సుభాష్ చంద్రబోస్, ట్రెజరర్‌గా ఈ.భాను బాబు మిగతా 14 మంది కార్యవర్గాన్ని ఈ మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి.ఎల్. కాంతారావు, జనరల్ సెక్రటరీ నిమ్మగడ్డ నాగేశ్వరరావు, అతిథులను సభా వేదిక పైకి ఆహ్వానించారు.
ఆలిండియా పెన్షనర్స్ అసోసియేషన్
జనరల్ సెక్రటరీ రాఘవేంద్రన్


