ఐజీని కలిసిన సంఘం నాయకులు
నగరంపాలెం: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని శనివారం స్థానిక కలెక్టరేట్ రోడ్డులోని గుంటూరు రేంజ్ కార్యాలయంలో విశ్రాంత పోలీసు అధికారుల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఐజీకి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. సంఘం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఐజీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ఆయా జిల్లాల ఎస్పీలతో మాట్లాడి పరిష్కరిస్తానని ఐజీ హామీ ఇచ్చారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ తెలిపారు. ఐజీని కలిసిన వారిలో సంఘం కోశాధికారి విశ్రాంత డీఎస్పీ డాక్టర్ కేవీ.నారాయణ, విశ్రాంత ఎస్పీ, సభ్యులు మేక రమేష్ ఉన్నారు.
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం జూలై, ఆగస్ట్ నెలల్లో నిర్వహించిన ఎంకాం, ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సుల 1,2,3,4 సెమిస్టర్లు, జర్నలిజం 1,2,4, యంఎల్‌ఎస్సి 1,2 సెమిస్టర్ల రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. ఫలితాలు దూరవిద్య వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునే వారు నవంబరు 7వ తేదీలోగా ఒక్కొక్క పేపరుకు రూ.960 చెల్లించి 10వ తేదీలోగా దరఖాస్తులు కోఆర్డినేటర్‌కు అందేలా పంపాలని సూచించారు. కార్యక్రమంలో దూర విద్య డిప్యూటీ రిజిస్ట్రార్ నయూద్ జైనులాబ్దిన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పి కృష్ణవేణి, డి కోదండపాణి, సూపరింటెండెంట్ టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: లోక కల్యాణార్థం, ప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో దాతల సహకారంతో అమరేశ్వరుడికి శనివారం లక్ష బిల్వార్చన జరిపారు. తొలుత ఆలయ అర్చకులు, వేద పండితులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గణపతి హోమాలు నిర్వహించారు. స్వామికి విశేష అలంకరణ అనంతరం సహస్రనామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిళ్వార్చన, బాలచాముండేశ్వరికి లక్ష కుంకుమార్చన జరిపారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ పవిత్ర కార్తిక మాసంలో పరమశివుని ఆరాధించి లక్ష బిల్వార్చన, బాల చాముండేశ్వరిదేవికి కుంకుమార్చన చేస్తే శుభాలు కలుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
యద్దనపూడి: పూనూరు గ్రామంలోని త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైనది. ఉదయం 6.32 నిమిషాలకు స్వామి వారికి అభిషేకం చేస్తున్న సమయంలో ఆలయానికి తూర్పు వైపున ఉన్న గోపురం రెండో అంతస్తు నుంచి సూర్య కిరణాలు ధ్వజస్తంభాన్ని స్పృశించి... ఆపై గర్భాలయాన్ని పావనం చేసి.. చివరిగా అంతరాలయంలో ఉన్న త్రిపురాంతక స్వామి వారి మూలవిరాట్‌ను తాకాయి. సుమారు మూడు నిమిషాల 18 సెకన్లపాటు అంతరాలయం బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలిగింది. ఈ దివ్యమైన క్షణాన్ని ఆలయంలో ఉన్న భక్తులు తిలకించి తరించారు.


