అంతర పంటల విధానాన్ని అవలంబించాలి
నరసరావుపేట రూరల్: ఒకే పంట పద్ధతికి బదులుగా అంతర పంటల విధానం అనుసరించడం ద్వారా చీడపీడల ఉధృతి తగ్గించడంతోపాటు పంట నష్టాలను నివారించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని బృందావన్ మీటింగ్ హాల్‌లో రైతు శిక్షకులకు రెండు రోజుల శిబిరం నిర్వహించారు. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగ్గారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలని తెలిపారు. రైతు శిక్షకులు తమ పరిధిలోని రైతులు ప్రకృతి పద్ధతులు ఆచరించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే.అమలకుమారి మాట్లాడుతూ జిల్లాను 190 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌కు రైతు శిక్షకుడిని నియమించినట్టు తెలిపారు. ప్రతి క్లస్టర్‌లో 125 మంది రైతులు 125 ఎకరాల్లో రసాయన రహిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అమలు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతకు ప్రకృతి వ్యవసాయమే శాశ్వత పరిష్కారమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్‌రాజ్, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, మేరి తదితరులు పాల్గొన్నారు.


