ప్రభుత్వ భూమిలో తమ్ముళ్ల పాగా
లాం గ్రామంలో రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో బ్రిక్స్ తయారీ ప్లాంట్‌కు ఏర్పాట్లు ప్రభుత్వ స్థలమంటూ అధికారులు నివేదిక ఇచ్చినా లెక్కచేయక అర్ధరాత్రి మెషినరీని దింపిన తెలుగుదేశం పార్టీ నాయకుడు
లాం (తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి అడ్డదారుల్లో సొంతం చేసుకునేందుకు లీజు డ్రామా ఆడిన తమ్ముళ్ల ఆగడాలను ఈ నెల 8వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి సర్వే నెం 199/ఏలో ఉన్నది ప్రభుత్వ భూమే అంటూ తేల్చారు. ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ జారీ చేసినందుకు గాను గ్రామ పంచాయతీ కార్యదర్శికి నోటీసులు అందజేశారు. అయితే సదరు కార్యదర్శి ఈ విషయం తనకేం సంబంధం లేదన్నట్లుగా ఎన్‌ఓసీని తాత్కాలికంగా విరమించుకుంటున్నామని, కనెక్షన్ తొలగించాలని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ తొలగించకపోవడంతో ఆక్రమణదారులకు పని సులువైంది. బుధవారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఎంచక్కా బ్రిక్స్ తయారీ ప్లాంటుకు అవసరమైన మెషినరీని తరలించి యంత్రాల సాయంతో దించి లోపల పెడుతున్నారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించగా విషయం తెలుసుకొని అనంతరం ఫోన్‌లు ఎత్తలేదని ఆరోపిస్తున్నారు. 199/ఎ సర్వే నంబర్‌లో ఆక్రమనలు ఉన్నాయి తొలగించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం వేసి నిరుపేదలకు చెందిన 40 ఇళ్లు నిలువునా కూల్చిన నాయకుడే ఇప్పుడు తిరిగి అదే సర్వే నెంబర్‌లో అర్ధరాత్రి ఆక్రమణకు పాల్పడటం విశేషం.


