పత్తి విక్రయాలకు ‘కపాస్‌’ | - | Sakshi
Sakshi News home page

పత్తి విక్రయాలకు ‘కపాస్‌’

Oct 24 2025 7:46 AM | Updated on Oct 24 2025 7:46 AM

పత్తి విక్రయాలకు ‘కపాస్‌’

పత్తి విక్రయాలకు ‘కపాస్‌’

పత్తి విక్రయాలకు ‘కపాస్‌’

మధ్యవర్తుల దోపిడీకి చెక్‌ పడే అవకాశం యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలంటున్న రైతులు

ఇకపై కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా పత్తి అమ్మకాలు !

కొరిటెపాడు(గుంటూరు): కేంద్ర ప్రభుత్వం పత్తి విక్రయాలకు ప్రత్యేకంగా ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ తీసుకొచ్చింది. దీని ద్వారానే విక్రయాలు చేయాలనే నిబంధన పెట్టింది. అంటే సాగుదారులు ఖచ్ఛితంగా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ పేర్లు, సాగు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ను ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టింది. అయితే పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. ఈసారి పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ యాప్‌లో రైతులు ముందుగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా మండలాలు మ్యాపింగ్‌, షెడ్యూల్‌ ప్రకారం కొనుగోళ్లు ఉంటాయి. పత్తి విక్రయించే సమయంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం అధికారులు అంచనా వేసిన దిగుబడి మేరకే కొనుగోలు చేస్తారు. ఒకసారి ఎంత పత్తి వస్తుందో అంతే అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తారు. దీంతో రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. జిల్లాలో ప్రస్తుతం వ్యవసాయాధికారులు ఈ–క్రాప్‌ బుకింగ్‌ వివరాలు నమోదు చేస్తున్నారు.

ఇవి తప్పనిసరి..

12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోళ్లకు అనుమతి ఉండదు. గతంలో 16 శాతం వరకు అనుమతి ఉండేది. పొడవాటి దూది గల(లాంగ్‌ స్టేఫుల్‌) పత్తికి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర, మధ్యస్థంగా ఉండే దూదికి టే క్వింటాలుకు రూ.7,710 కనీస మద్దతు ధరగా నిర్ణయించారు.

దళారుల దోపిడీకి చెక్‌..

రైతులు పత్తి విక్రయించాలంటే మధ్యవర్తుల దోపిడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు సీసీఐ ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా నేరుగా రైతులు స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని పంట విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. కొంతమంది వ్యాపారులు, దళారులు ఇతర రైతుల పేరిట సీసీఐకి పత్తి విక్రయించి లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి వాటికి ఇక చెక్‌ పడనుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో.. ఆ మేరకు మాత్రమే కొనుగోలు చేయనున్నారు.

వివరాల నమోదు ఇలా..

రైతులు పంట అమ్ముకునేందుకు సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత రైతు పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి. తర్వాత ఎక్కడ విక్రయించాలనుకుంటున్నారు? ఎప్పుడు? ఎంత సరుకు? ఏ మార్కెట్‌? ఏ జిన్నింగ్‌ మిల్‌కు తెస్తున్నారు? తదితర విషయాలు పొందుపర్చాలి. పాసు పుస్తకం వివరాలు, బ్యాంక్‌ ఖాతానూ అందులో యాడ్‌ చేయాలి. లేదంటే పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవచ్చు. అనంతరం పంట వివరాలు తెలియజేయాలి. సొంత భూమి, కౌలుదారా అనేది వివరించాలి. పట్టాదారు పాస్‌ పుస్తకం నంబర్‌, సర్వే నంబర్‌, మొత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలతో పాటు రైతు ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాలు చాలామంది రైతులకు తెలియక తికమక పడుతున్నారు. కొందరు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. వారి వివరాలనూ ఇందులో నమోదు చేయాలి. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చినా.. వారు ఇంత వరకు రైతులకు అవగాహన కల్పించలేదు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక అత్యధిక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement