సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలి
నగరంపాలెం: జిల్లా ప్రజలకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన పెంపొందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో గురువారం గ్రామ/వార్డు మహిళా పోలీసులకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అవగాహన వల్లే సైబర్ నేరాలు, మోసాలను నివారించవచ్చు అనే నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు. 1930 జాతీయ సైబర్ భద్రత సహాయత నంబర్ 1930పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అక్టోబర్ నెలను జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసంగా ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన సదస్సులు చేపడుతున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు ప్రతి రోజు ప్రజలతో మమేకమవ్వాలన్నారు. బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పాఠశాలల్లో మంచి–చెడుల స్పర్శ, సీసీ కెమెరాల ఉపయోగాలపై అవగాహన కల్పించాలన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ నేరాలు, మోసాలు ప్రజల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరగాళ్ల బారినపడి, డబ్బు పొగోట్టుకుంటున్నారని అన్నారు. ప్రతి మహిళా పోలీస్ సమాజంలో సైబర్ భద్రత రాయబారి పాత్ర పోషించాలని అన్నారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆవిష్కరించారు. సదస్సులో ఐటీ కోర్ సీఐ నిస్సార్‌బాషా, హెడ్‌కానిస్టేబుల్ కిషోర్, మహిళా కానిస్టేబుళ్లు మానస, అరుణ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


