రేపటి నుంచి ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఎల్‌వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి నవంబరు 3వ తేదీ వరకు ఏపీ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మైనేని బ్రహ్మేశ్వరరావు, కార్యదర్శి యాగంటి దుర్గారావు మంగళవారం తెలిపారు. క్లబ్‌లో నూతనంగా, అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన బిలియర్డ్స్ అండ్ స్నూకర్ టేబుల్స్‌పై పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలను ఏపీ బిలియర్స్ అండ్ స్నూకర్స్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను 2026 జనవరిలో హరియాణాలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బిలియర్డ్స్‌కు 38 ఎంట్రీలు, స్నూకర్‌కు 215 ఎంట్రీలు నమోదు అయ్యాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంట్రీలు అత్యధికంగా నమోదవడంతో ఈ టోర్నమెంట్ మరింత ప్రాధాన్యం ఏర్పడిందని తెలిపారు. క్లబ్ తరుఫున తమ అత్యుత్తమ క్రీడాకారులు ఎస్.శంకరరావు, ఎం.శ్రీనివాసరావులు పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు 20 సార్లు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరచి అనేక పథకాలు సాధించారన్నారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బ్రహ్మేశ్వరరావు, దుర్గారావులతోపాటు కార్యదర్శిగా పులివర్తి వెంకటేశ్వరరావు (అజార్), ఉపాధ్యక్షులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి ఏల్చూరి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాసరావు, టోర్నమెంట్ నిర్వాహక అధ్యక్షులు జి.స్వరాజ్యరావు, ఉపాధ్యక్షులు టి.పాండురంగారావు, సంయుక్త కార్యదర్శి వి.బాలాజీ పాల్గొన్నారు.


