
తిన్నారా.. తినలేక పడేశారా..?
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు బీసీ బాలుర వసతి గృహంలో పరిశుభ్రత మచ్చుకై నా కానరావడం లేదు. డస్ట్‌బిన్‌లో అన్నం పడేశారు. అసలు ఆహారం తిన్నారా? తినలేక పడేశారా..? ప్రభుత్వం ఇచ్చే బియ్యమే కదా అని అధికంగా వండి వ్యర్థాల డబ్బాలో పారవేశారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం బీసీ కళాశాల బాలుర వసతిగృహంలో కనిపించిన ఈ దృశ్యాలు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి, ఉన్నతాధికారుల ఉదాసీనతకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న పెదనందిపాడు మండలం అన్నపర్రు బాలుర హాస్టల్లో ఐదు రోజుల కిందట విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ ప్రత్తిపాడు హాస్టల్ సిబ్బందికి కనువిప్పు కలిగినట్లుగా లేదు. హాస్టల్ ఆరంభంలోనే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. మిగిలిన వ్యర్థాలు డబ్బాలో పడేసి, మూత కూడా పెట్టలేదు. దోమలు, ఈగలు వాలి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా మరుగుదొడ్ల నుంచి వచ్చే మురుగు సైతం ఆవరణలోనే నిలిచి ఉంది. నీటి కొళాయిలు ఉన్న ప్రదేశం అంతా పాచి పట్టి అపరిశుభ్రంగా మారింది. అయినా హాస్టల్ వార్డెన్‌కు కనీసం చీమ కుట్టినట్లయినా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆహార పదార్థాల వ్యర్థాలు విచ్చలవిడిగా పడేయడంతో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇకనైనా జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పందించి హాస్టళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రత్తిపాడు బీసీ హాస్టల్లో మారని పారిశుద్ధ్య నిర్వహణ తీరు