
నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
నిలిచిపోనున్న పేదల ఉచిత వైద్యసేవలు నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించని సర్కార్
గుంటూరు మెడికల్: జిల్లాలో శుక్రవారం నుంచి ఉచిత వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేసిన ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా మిన్నకుండి పోయింది. దీంతో ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు అందించిన ఆస్పత్రులు తమకు బకాయిలు చెల్లించే వరకు వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కూటమి పాలనలో పేదల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించే ఏపీ స్పెషాలిటి హాస్పటల్ అసోసియేషన్( ఆషా)కు కోట్లాది రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిలుపుదల చేసింది.
మహానేత ప్రవేశపెట్టిన పథకం
పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాల వారు సైతం అమలు చేసేలా గొప్ప పథకంగా డాక్టర్ రాజశేఖరరెడ్డి దానిని తీర్చిదిద్దారు. నేడు ఆరోగ్యశ్రీ పథకం పేరును కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవగా మార్పు చేసింది. పథకం ద్వారా వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టడంతో ఆస్పత్రుల వారు శుక్రవారం నుంచి వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అస్తవ్యస్తంగా పథకం
డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం కూటమి పాలన ప్రారంభమయ్యాక అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఈ పథకంలో కార్పొరేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే గాని తాము కోలుకోలేమని, పేదలకు ఉచిత వైద్యసేవలు అందించలేమని ఆషా సంఘం నేతలు తెగేసి చెప్పారు.
నేటి నుంచి ఉచిత వైద్యం బంద్
ఏపీ స్పెషాలిటి హాస్పటల్ అసోసియేషన్(ఆషా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ఆషా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సుబ్బరాయుడు, డాక్టర్ శివశంకరయ్యలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.2,700 కోట్ల నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఏడాదిగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ సీఈఓ క్లెయిమ్ అప్రూవల్స్ సుమారు రూ.670 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముందుగా రూ.670 కోట్లు విడుదల చేస్తేనే ఉచిత వైద్యసేవలు అందించేందుకు ముందుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పథకాన్ని ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీకి అప్పగించే ప్రయత్నంలో ఉన్న దృష్ట్యా పథకం గైడ్‌లైన్స్ ఏర్పాటులో ఆషా సభ్యులను తప్పనిసరిగా భాగస్వాముల్ని చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.