
పశు సంతతిని పెంచుకోవాలి
ప్రత్తిపాడు: గ్రామాల్లో రోజురోజుకీ తగ్గిపోతున్న పశుసంతతిని పెంచుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె.వి.వి. సత్యనారాయణ అన్నారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో గురువారం ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేలుజాతి లేగ దూడల ప్రదర్శనను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన ప్రత్తిపాడు ఏడీ సుగణ్యరావు, ఇతర అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పాడి రైతులు లేగ దూడలకు సరైన పోషకాహారం అందించాలన్నారు. యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పశు సంతతిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చన్నారు. లింగ నిర్ధారిత వీర్యం వలన బహుళ ప్రయోజనాలున్నాయని, రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి. శంకరరావు, పశువైద్యులు డాక్టర్ వై. ఈశ్వరరెడ్డి, సీహెచ్. హరీష్ ఖన్నా, కె.వి.ఎస్. నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.