
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి
అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచన రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశాలు
నగరంపాలెం: జిల్లాలోని ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో గురువారం నేర సమీక్షా సమావేశం (సెప్టెంబర్ – 2025) నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోజు రెండుసార్లు రోల్‌కాల్‌తోపాటు, వారంలో ఒకసారి పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం చేపట్టాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలపై దృష్టి సారించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. రాత్రుళ్లు గస్తీ నిర్వర్తించే సమయంలో లాఠీలు, టార్చ్‌లైట్లు, విజిల్స్ తీసుకెళ్లాలని, పోలీస్ సైరన్ వినియోగించాలని చెప్పారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి పదిన్నరలోపు దుకాణాలు మూసివేయించాలని, లేనిచో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రాత్రుళ్లు అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సాంకేతిక పరికరాలతో తనిఖీలు చేయాలని చెప్పారు. విద్యా, వ్యాపార సంస్థల వద్ద గస్తీ కొనసాగించాలని తెలిపారు. రహదారులపై అల్లర్లు సృష్టించే వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉండాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉండాలని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరవాలన్నారు. రానున్న దీపావళి దృష్ట్యా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాణసంచా విక్రయ దుకాణాలు, నిల్వలు, లైసెన్సులను పరిశీలించాలని సూచించారు. అనుమతుల్లేని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ.రవికుమార్ (ఎల్/ఓ), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.