
జీఎస్టీ తగ్గింపులపై విస్తృత ప్రచారం
గుంటూరు వెస్ట్ : సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సెలూన్, స్పా తదితర వాణిజ్య కార్యకలాపాల కేంద్రాల్లో సోమవారం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరం నుంచి ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని విద్యాసంస్థల్లో ప్రచారం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, వక్తృత్వ తదితర పోటీలను నిర్వహించాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపుతో మెరుగైన గ్రామీణ కనెక్టివిటీ, సురక్షితమైన రవాణా ఎంపికలు, విద్యా సామగ్రిపై పన్ను ఉపశమనం, స్టార్టప్‌లకు మద్దతు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను సంబంధిత పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని జేసీ ఆదేశించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి.గీతామాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ