
కూటమి మోసాలపై పోరుబాట
ఎన్నికల వేళ అడ్డగోలు హామీలిచ్చిన కూటమి నేతలు 4 డీఏల బకాయిల కోసం తప్పని ఎదురుచూపులు పీఆర్సీ ఊసు కూడా ఎత్తకపోవడంపై మండిపాటు ఇప్పటికే రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు రేపు విజయవాడలో ఫ్యాప్టో ‘ పోరుబాట’
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహం
హామీలన్నీ నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని దాదాపు 25 వేల మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు పీఆర్సీ, మంచి ఐఆర్ ఇస్తామని, పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రాలు సమర్పిస్తున్నా ఎలాంటి స్పందన లేదు.
●
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎలాంటి కష్టం లేకుండా సకాలంలో చెల్లింపులు చేశారు. అంతకుముందు ప్రభుత్వం బకాయి పెట్టిన 3 డీఏలూ చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు డీఏలు బకాయి పెట్టింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలు కూడా మంజూరు చేయడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. బిడ్డల చదువులకు, వివాహాల నిమిత్తం దాచుకున్న దానిలో రుణాల కింద విడుదల చేయాలని దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకునే నాఽథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా కానుకగా కనీసం రెండు డీఏల బకాయిలైనా విడుదల చేస్తారని ఎదురుచూసినా నిరాశే మిగిలింది.
25 వేల మందికి వెన్నుపోటు
రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బలయ్యారు. వీరిలో 7,415 మంది ఉపాధ్యాయులు ఉండగా.. మిగతావారు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఒక్క డీఏ బకాయి వరకు చూసుకున్నా సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లపైనే బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాల బకాయిలు మరో రూ.160 కోట్లు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది పెన్షనర్లు కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్నారు.
పీఆర్‌సీ ఊసే ఎత్తడం లేదు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్‌సీ ప్రకటిస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన విడుదల కావడం లేదు. 12వ పీఆర్‌సీ ప్రకటిస్తే కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ లభించి, సుమారు రూ.50 వేల జీతం తీసుకునే ఉద్యోగికి మరో రూ.15 వేల వరకు అదనంగా వచ్చే అవకాశం ఉందని, సర్కారు కప్పదాటుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించగా, అధ్యయనం చేస్తుండగానే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో కష్టాలు మొదటికొచ్చాయని వాపోతున్నారు.
సర్కారు తీరుపై సంఘాల ఆగ్రహం
బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు దిగాయి. ఐక్యవేదికగా ఏర్పడి పోరుబాట పట్టాయి. ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఏపీటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వారం చేపట్టగా .. యుటీఎఫ్ రణభేరి కార్యక్రమం నిర్వహించింది. ఈ నెల 7న ఫ్యాప్టో ఆధ్వర్యంలో పోరుబాట పేరుతో ఽవిజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్జీవో నాయకులు సైతం వచ్చే రెండు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని హెచ్చరించారు.
2023 జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేయాల్సి ఉంది. చైర్మన్‌ను నియమించాక కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు దాటుతున్నా ఆ మాటే ఎత్తక పోవడం దురదృష్టకరం. పాత పీఆర్‌సీ బకాయిలు ఇచ్చిన తరువాతే కొత్త పీఆర్‌సీ కమిషన్‌ను వేస్తామని చెబుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అడిగితే ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని మాట దాటవేస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి. కనీసం ఒక్క డీఏను కుడా ఇవ్వలేదు. పాత పీఆర్‌సీ బకాయిలు ఇవ్వడం లేదు. విజయవాడలో 7న జరిగే పోరుబాట ధర్నాలో పీఆర్‌సీయే ప్రధానం. – ఎస్‌ఎం సుభాని, ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు

కూటమి మోసాలపై పోరుబాట