
ఏపీకే ఫైల్.. బీ కేర్‌ఫుల్!
సైబర్ మోసాలకు అవకాశం లింకులను క్లిక్, డౌన్ లోడ్ చేస్తే వెంటనే వాట్సాప్ హ్యాక్ అప్రమత్తత అవసరమంటున్న పోలీసులు
మోసం చేసే విధానం ఇలా..
నిందితులు వాట్సాప్, టెలీగ్రామ్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా లింక్‌లు పంపుతారు.
డెలివరీ బాయ్, రీఫండ్ లింక్, డిజిటల్ కేవైసీ, ఎస్బీఐ, రివార్డ్స్ అప్డేట్, ఫ్రీ గిఫ్ట్, అర్జెంట్ డాక్యుమెంట్, ఈ– చలానా, పీఎం కిసాన్ వంటి పేర్లు గల లింకులతో వినియోగదారులను ఆకర్షిస్తారు.
లింక్ ద్వారా ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్
అవుతుంది.
వినియోగదారుడు దాన్ని యాప్ అనుకుని ఇన్‌స్టాల్ చేస్తాడు.
యాప్ పర్మిషన్స్ అడుగుతుంది.
ఎస్‌ఎంఎస్, కాంటాక్ట్స్, కాల్ లాక్స్, స్టోరేజ్, నోటిఫికేషన్స్, అసెస్‌బులిటీ తదితరాలు అనుమతులు ఇచ్చిన వెంటనే ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది.
ఫోన్‌లోని ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/ డెబిట్ కార్డ్ సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది.
కొన్నిసార్లు యూపీఐ యాప్‌లను కూడా నేరుగా యాక్సెస్ చేసి ఖాతాలోని డబ్బును దొంగిలిస్తారు.
అదనంగా, కొన్ని సందర్భాల్లో ఫోన్ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు కూడా తెగబడుతున్నారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): సాంకేతిక పెరుగుతున్న కొద్ది సైబర్ నేరగాళ్లు కొత్తా పంథాలో దోపిడీ మొదలెట్టారు. గుర్తు తెలియని వ్యక్తుల వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా ఏపీకే ఫైల్స్, లింకులు, డాక్యుమెంట్లు పంపి, నిమిషాల వ్యవధిలో దోచుకుంటున్నారు. ఏపీకే ద్వారా ప్రజల ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, ఫొటోలు, డాక్యుమెంట్లను దొంగలిస్తూ, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి కేసుల్లో కనీస పురోగతి కూడా లభించని దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోదారులు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్‌పై ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం
సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్తలు ఎంతో అవసరం. ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే కేవలం ప్లే స్టోర్ నుంచి మాత్రమే చేయాలి. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దు. ఫోన్‌లోని ప్రతి యాప్‌కు ఇచ్చే అనుమతులను అప్రమత్తంగా పరిశీలించాలి. బ్యాంక్ అకౌంట్, యూపీఐ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు. ఫోన్‌లో అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ చేశారని అనుమానం కలిగితే, వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాలి. మొబైల్ రీసెట్ చేసి ట్రస్ట్ (నమ్మకం) చేసిన యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫోన్‌లో భద్రత కోసం యాంటీ వైరస్/యాంటీ మాల్వర్ యాప్‌లను వినియోగించాలి.
మోసానికి గురైతే ఇలా చేయాలి
ఆన్‌లైన్ మోసానికి గురైతే తక్షణమే 1930 (నేషనల్ సైబర్ హెల్ప్ లైన్) నంబర్‌కు కాల్ చేయాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైబర్ క్రైమ్. జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. దగ్గరలో గల పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. 1930కి ఫిర్యాదు చేయడం ద్వారా త్వరిగతిన ఏదైనా సాంకేతికత ద్వారా నిందితులను ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
కొద్ది రోజుల కిందట నగరంలోని లాలాపేట ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఏపీకే మేసేజ్ వచ్చింది. దాన్ని అతడు ఓపెన్ చేయడంతో రూ 40వేల వరకు ఖాతాలో ఖాళీ అయ్యాయి.
పాత గుంటూరు ఆనందపేటకు చెందిన మొహమ్మద్ ముజమ్మిల్‌కు ఈ నెల 13న వాట్సాప్‌లో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఫైల్స్ (ఏపీకే) మేసేజ్ వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఫోన్ హ్యాక్ అయింది. మొబైల్ ఆయన మాట వినడం మానేసింది. కేవలం నిమిషాల వ్యవధిలో రూ. 1,18,000 అమెజాన్ కార్డులో నుంచి డెబిట్ అయ్యాయి.