
నిరంతర అభ్యాసంతో విజయాలు సొంతం
చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజ్ఞాన్‌లో కొనసాగుతున్న నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు
చేబ్రోలు: చెస్ ఆటలో మనం గడిపే ప్రతి క్షణం విలువైనదేనని చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘62వ నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు’ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఆదివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్, కోనేరు హంపితో విజ్ఞాన్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ ముందుగా ఒక ఎత్తు వేసి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేరు హంపి మాట్లాడుతూ చెస్ క్రీడాకారులందరికీ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఒక గొప్ప వేదికన్నారు. నిరంతర అభ్యాసం, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయాలు సొంతమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఆటలోని ప్రతి అనుభవాన్ని పాఠంగా తీసుకొని ముందుకు సాగితేనే నిజమైన క్రీడాకారుడిగా ఎదగవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆలిండియా చెస్ ఫెడరేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఏకే వర్మ మాట్లాడుతూ చెస్ అనేది ఆలోచన, ఓర్పు, దృష్టి, మేధస్సుల కలయికన్నారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు.
ఏడవ రౌండ్ ఫలితాలు..
జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏడో రౌండ్ ముగిసే సరికి, తొలి ఆరు బోర్డులలో నిర్ణయాత్మక ఫలితాలు రాకపోవడంతో ఆధిక్యంలో మార్పు లేకుండా నిలిచింది. ఇప్పటివరకు 6 పాయింట్లు సాధించిన పీఎస్‌పీబీకి చెందిన గ్రాండ్‌మాస్టర్స్ శశికిరణ్, అభిజిత్ గుప్తా, రైల్వేస్ ఐఎం అరోన్యక్ ఘోష్, ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిలు లీడ్‌ను కొనసాగించారు. వీరితో పాటు విజయాలు సాధించిన పీఎస్‌పీబీకి చెందిన జీఎం దీప్ సేంగుప్తా, రైల్వేస్ ఐఎం ఆయుష్ శర్మ, తమిళనాడుకు చెందిన ఐఎం హర్ష సురేష్ కూడా 6 పాయింట్ల క్లబ్‌లో చేరారు.