డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: గుంటూరులోని కార్యాలయంలో సోమవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అధ్యక్షతన సబ్ డిస్టిక్ లెవెల్ మాతృ మరణాల సమీక్ష సమావేశం జరిగింది. చేబ్రోలు, నిడమర్రు, మందపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జులై, ఆగస్టుల్లో జరిగిన మూడు మాతృ మరణాలపై సభ్యులు సమీక్షించారు. మరణానికి గల కారణాలను అధ్యయనం చేశారు. అందులో ఒకటి నివారించగలిగినది గాను, రెండు నివారించలేనివి గాను నిర్ధారించారు. సమావేశానికి హాజరైన ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. గర్భం దాల్చినప్పటి నుంచి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలని చెప్పారు. తొలుత ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించి, మాతృ మరణాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రంగారావు , ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ , జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొల్లిపర: మండల పరిధిలోని చివలూరు శివారు జగనన్న కాలనీ సమీపంలో సోమవారం రాత్రి 10గంటలు సమయంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరు గాయపడ్డారు. కొల్లిపరకు చెందిన కంచర్ల విశ్వాస్, సుధీర్‌లు చివలూరుకు వెళుతున్నారు. ఈ సమయంలో తెనాలి నుంచి గుదిబండి వారిపాలేనికి వస్తున్న ఆటో జగనన్న కాలనీ సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విశ్వాస్ అక్కడికక్కడే మృతి చెందగా సుధీర్ గాయపడ్డాడు. ఆటోలో ఉన్న శేషం కృపారావుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 ద్వారా పోలీసులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మాతృ మరణాలను అరికట్టాలి