
పూర్ణఫలం.. బాలానందం
తొలి రోజు బాలా త్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం తొలి దర్శనం చేసుకున్న మంత్రులు, జిల్లా అధికారులు భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి వేడుకగా ఆది దంపతుల నగరోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌కు స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం దర్శనాలకు అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో పాటు పలువురు జిల్లా అధికారులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. అక్కడ అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం సమీపంలోని యాగశాలలో కలశస్థాపన, పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
జన హృది బాలా.. నిత్యకల్యాణశీలా..
మహా మండపం ఆరో అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలో 104 మంది ఉభయదాతలు ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రనవార్చనలో 13 మంది, చండీయాగంలో 29 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి రూ. 300 క్యూలైన్‌లో బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక పరోక్ష చండీ హోమానికి 57 మంది, కుంకుమార్చనకు 18 మంది రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో పూజను వీక్షించారు. మహా మండపం ఆరో అంతస్తులో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గగుడిపై నేడు
శ్రీగాయత్రీదేవి అలంకారం
నయనానందకరం.. నగరోత్సవం..
ఆది దంపతుల నగరోత్సవ సేవ సోమవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పాటు కేరళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కావడి నృత్యాలతో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, దుర్గాఘాట్, దుర్గగుడి ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది.
తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం
ఉదయం ఆరు గంటలకు
ప్రత్యేక ఖడ్గమాలార్చన(ఆరో అంతస్తు)
ఉదయం 7 గంటలకు, 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన(ఆరో అంతస్తు)
ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం(యాగశాల)
ఉదయం 9 గంటలకు ప్రత్యేక
శ్రీచక్రనవార్చన(లక్ష కుంకుమార్చన వేదిక)
సాయంత్రం 4 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల
నగరోత్సవ సేవ
సాయంత్రం 6 గంటలకు మహా నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి
రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం