రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
గుంటూరు వెస్ట్ : ఈవీఎంల భద్రతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా భద్రత ఏర్పాట్లు, సీసీటీవీ పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎన్.షేక్ ఖాజావలి, గుంటూరు ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
దుగ్గిరాల : స్థానిక శుభం కోల్డ్ స్టోరేజ్‌లో ఆరుబయట ఉంచిన పసుపు బస్తాలను లోపల వేసి సీజ్ చేయాలని సిబ్బందిని తహసీల్దార్ ఐ. సునీత ఆదేశించారు. కోల్డ్ స్టోరేజ్‌లో గతంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అందులో మిగిలిన 1,169 బస్తాలను అప్పట్లో సీజ్ చేశారు. పురుగులు పడుతున్నాయని, వాటిని బయటకు తీసి యాజమాన్యం గ్రేడింగ్ చేస్తుండగా స్థానిక రైతులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పసుపు యార్డు సెక్రటరీ జె.వి. సుబ్బారావు హుటాహుటిన కోల్డ్ స్టోరేజ్‌కు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేసిన పసుపు బస్తాలను బయటకు ఎందుకు తీశారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అనంతరం బస్తాలన్నింటిని లోపల వేసి, సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇద్దరు వీఆర్వోలు, యార్డ్ సిబ్బంది బస్తాలను లెక్కించినట్లు తహసీల్దార్ తెలిపారు.
ఆన్‌లైన్‌లో అగ్రిసెట్ ఫలితాలు
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆగస్ట్ 18వ తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహించిన అగ్రిసెట్– 2025 పరీక్ష ఫలితాలను సోమవారం వీసీ ఆర్. శారదజయలక్ష్మీదేవి విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతికత పరిజ్ఞానం కోర్సుల్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు నాలుగు సంవత్సరాల వ్యవసాయ డిగ్రీ కోర్సు చదువుకునేందుకు అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షకు 844 మంది విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోగా 813 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో 753 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఫలితాలు మంగళవారం నుంచి విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఎం.వి. రమణ తెలిపారు. అగ్రిసెట్ కౌన్సెలింగ్ తదితర వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.
జ్వాలాముఖి అమ్మవారికి మంగళసూత్రాల సమర్పణ
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని జ్వాలాముఖి దేవి అమ్మవారికి అర్చక కుటుంబానికి చెందిన శంకరమంచి రామమోహనరావు కుమారుడు గణేష్‌కుమార్ బంగారు మంగళ సూత్రాలను సమర్పించారు. 12 గ్రాముల బరువుతో రూ.1.50లక్షల విలువైన రెండు బంగారు మంగళసూత్రాలను సోమ వారం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి ఈఓ రేఖకు అప్పగించారు.
ఈవీఎంల భద్రతపై రాజీ వద్దు
ఈవీఎంల భద్రతపై రాజీ వద్దు