
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
పెదకాకాని: ఏఎన్‌యూ పరిధిలో 2025–26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ దూర విద్యా కోర్సులకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. గంగాధరరావు, వర్సిటీ ఇన్‌చార్జి రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత ఆదివారం 10 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఎంబీఏకు 600 మంది దరఖాస్తు చేసుకోగా 444 మంది పరీక్షకు హాజరు కాగా, 435 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. ఎంసీఏకు 128 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 82 మంది పరీక్షకు హాజరు కాగా, 80 మంది అర్హత సాధించారని వివరించారు.