
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం
డయేరియా నివారణ చర్యలు చేపడుతున్నాం : కలెక్టర్
గుంటూరు వెస్ట్: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం పర్యవేక్షణతో పాటు అనారోగ్యకరమైన ఆహారం అమ్మకాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి గుంటూరు నగరంలో డయేరియా కేసులు కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వివిద శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డయేరియా, కలరా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందటానికి గల కారణాలు తెలుసుకోవడానికి, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కమ్యూనిటీ డిసీజ్ నిపుణులతో పాటు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ లేదా పంచాయతీ అధికారులు.. మెడికల్ కళాశాల, ప్రభుత్వ సమగ్ర వైద్యశాల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. బృందం సభ్యులు కేసులు నమోదవుతున్న సమయం, ప్రాంతం, వ్యాధి బారిన పడుతున్న వ్యక్తుల వయస్సు, క్లినికల్ అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయాలని ఆదేశించారు. దీనివల్ల నివారణ చర్యలు మరింత పటిష్టంగా చేపట్టడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సురక్షితమైన మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించారు. వ్యాధులు నమోదవుతున్న ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. నిర్దేశిత ప్రమాణాలు లేని వాటర్ ప్లాంట్లను మూసి వేయించాలని ఆదేశించారు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు విక్రయించకుండా నిరంతరం తనిఖీ నిర్వహించాలని చెన్నారు. ఆరోగ్య భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై రెవెన్యూ , పోలీస్ అధికారుల ద్వారా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఇప్పటివరకు 146 మంది డయేరియా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు, ప్రస్తుతం 84 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతావారు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డయేరియా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో తాగునీటికి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరిచేలా నగరపాల సంస్థ అధికారులతో కలిసి చర్యలు తీసుకున్నామని వివరించారు. ట్యాంకుల ద్వారా పూర్తిస్థాయిలో రక్షిత మంచినీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆహార భద్రత కమిషనర్ వ్యక్తిగత శుభ్రతపై జారీ చేసిన ప్రచార పోస్టర్‌ను వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్, కమిషనర్, అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో ఈఎన్సీ ప్రభాకర్‌రావు, జీఎంసీ అదనపు కమిషనర్ ఓబులేసు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణా యశస్వి, ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్