
వైఎస్సార్‌సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో పలువురిని పలు పదవుల్లో నియమించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన దాసరి కత్తెరేణమ్మను మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన భుక్యా శాలినిని మహిళా విభాగం సహాయ కార్యదర్శిగా, తాడికొండ అసెంబ్లీకి చెందిన కందుల సిద్ధయ్యను బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన చిన్నపోతుల దుర్గారావును ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోనా రుతిక్‌రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మహ్మద్ ఫిరోజ్, తాడికొండ నియోజకవర్గానికి చెందిన ముత్యాల బాలస్వామిని పబ్లిసిటీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఆరేపల్లి జోజిని పంచాయతీరాజ్ విభాగం సహాయ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అంగన్‌వాడీ విభాగ అధ్యక్షురాలిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి రమణిని నియమించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా కానూరు శశిధర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పిడతల భానుప్రకాష్‌లను నియమించారు.
సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలి
లక్ష్మీపురం: గూడ్స్, పార్సిల్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గుంటూరు డివిజన్ అధికారులు అందుబాటులో ఉంటారని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గూడ్స్, పార్సిల్ వినియోగదారులు బిజినెస్ డెవలప్‌మెంట్ యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సరుకు లోడింగ్‌ను పెంచి లక్ష్యాన్ని సాఽధించేందుకు సహకరించాల్సిందిగా కోరారు. సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
నేటి నుంచి స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలు
నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 19వరకు వివిధ క్రీడాంశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు డీఈఓ ఎల్.చంద్రకళ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్‌కుమార్, మహిళా కార్యదర్శి వి.పద్మావతి బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంపికలు స్పెల్– 1లో భాగంగా అండర్–14, అండర్–17 బాలురు, బాలికల విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. పోటీల్లో భాగంగా ఈనెల 11న నందిగామ జెడ్పీ హైస్కూలులో సెపక్‌తక్రా, 12న డీఎస్‌ఏ స్టేడియంలో కరాటే, 15న చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాలలో జూడో, గట్కా, 16న డీఎస్‌ఏ స్టేడియంలో ఫుట్‌బాల్, 17న అచ్చంపేట గురుకుల పాఠశాలలో రగ్బీ, 18న ఎస్‌ఎస్ అండ్ ఎన్ కళాశాల స్విమ్మింగ్ పూల్‌లో ఈత, 19న ఏఎంజీ పాఠశాలలో బాక్సింగ్, అచ్చంపేటలో రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.
ఏపీఆర్‌ఎస్‌ఏ క్రీడా పోస్టర్ ఆవిష్కరణ
గుంటూరు వెస్ట్: ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర స్థాయి క్రీడా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 7, 8, 9వ తేదీల్లో అనంతపురంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్‌కు జిల్లా నుంచి 55 మంది పాల్గొంటారని తెలిపారు.
13న ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సదస్సు
లక్ష్మీపురం: ఈ నెల 13న జరిగే రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలోని కొత్తపేట సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్యలింగం భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో నాసర్‌జీ మాట్లాడుతూ విద్య, వైద్యరంగాల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బాలనవ్యశ్రీ , జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్ పాల్గొన్నారు.