
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నాన్–టీచింగ్ సిబ్బం
గుంటూరురూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాన్–టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు అందించటం సంతోషకరమని నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నగర శివారు లాంలోని విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం స్థాపితమైన 1964 నుండి, ఇలాంటి భారీ సంఖ్యలో బోధనేతర సిబ్బందికి పదోన్నతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషమన్నారు. పదోన్నతులకు సహకరించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి, రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు ఇతర ఉన్నతాధికారులకు అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ అశోక్, అసోసియేట్ ప్రెసిడెంట్ సతీశ్, జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ, తదితరులున్నారు.