
అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు
లక్ష్మీపురం: ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గుంటూరు జిల్లా 10వ మహాసభలో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు చేసినట్లు ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి రమణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధనలక్ష్మి, ఏవీఎన్ కుమారి తెలిపారు. పాతగుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు గత 42 రోజుల సమ్మె విరమణ సందర్భంగా చేసిన ఒప్పందంలో భాగంగా తక్షణమే జీతాలు పెంపుదల చేయాలన్నారు. ధరల పెరుగుదల కనీస వేతనాలను దృష్టిలో ఉంచుకొని రూ.26 వేలు జీతం ఇవ్వాలని తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆదాయ పరిమితి ఉన్నప్పటికీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు విడో పెన్షన్, తల్లికి వందనం, రేషన్ కార్డులు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే నిర్ణయం చేసి అంగన్‌వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు.
జిల్లా కార్యవర్గం ఎన్నిక
మహాసభలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా గౌరవాధ్యక్షులుగా జి రమణ, అధ్యక్షులుగా ఎం.ధనలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జి ప్రేమలత, ప్రధాన కార్యదర్శిగా ఏవీఎన్ కుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టీ.శివపార్వతి, కోశాధికారిగా ఈ రత్నమంజుల, ఉపాధ్యక్షులుగా వి.విజయలక్ష్మి, రుక్మిణి, రజిని, టి పద్మావతి, ఓ రోజమ్మ కార్యదర్శులుగా కె ఎలిజబెత్, హేమలత, అస్మత్ తార, కే పద్మ, ఎస్ కే షాహిదా ఎన్నికయ్యారు. మరో 18 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు.

అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి