
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగించారు. నిరసనవారంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 60 మండలాల పరిధిలో తహసీల్దార్లకు మెమోరాండం సమర్పించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ తెలిపారు. ఆయా మండలాల వారీగా తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులతో కలిసి ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొనగా, గుంటూరు తూర్పు, పశ్చిమ మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో బసవ లింగారావు, ఎండీ ఖాలీద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు రోడ్‌మ్యాప్ షెడ్యూల్ ప్రకటించాలని, లేని పక్షంలో ఈనెల 13,14వ తేదీల్లో ప్రజా ప్రతినిధులందరినీ కలిసి మెమోరాండంలను సమర్పిస్తామని తెలిపారు. నిరసన ప్రదర్శనల్లో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా జనార్ధనరావు, పి.పార్వతి, సత్యనారాయణమూర్తి, కార్యదర్శి జి.దాస్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్‌బాషా, నాయకులు గడ్డిపాటి శివరామకృష్ణ, బి.సాయిలక్ష్మీనారాయణ, సీహెచ్ లక్ష్మణ్‌కుమార్, చక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.