
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
నెహ్రూనగర్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో శుక్రవారం మార్కెట్ సెంటర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలు వలే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినప్పటికీ రక్షణ చట్టం ఊసే లేదన్నారు. చట్టసభల్లో 33 శాతం, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరో వాగ్దానం ఇచ్చినప్పటికీ ఇంతవరకు అతీగతి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందే నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతుంటే.. మరోపక్క ఇంతవరకు బీసీల కులగణన చేపట్టకపోవడం చూస్తుంటే బీసీలను అన్యాయం చేయడమే అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, పారేపల్లి మహేష్, కోలా అశోక్, కొల్లూరు హనుమంతరావు, ముప్పన వెంకటేశ్వర్లు, తురక రమేష్, కోలా మణికంఠ, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.