
ఏఎన్‌యూ నిర్వాకం.. బాధ్యతారాహిత్యం !
అర్ధంతరంగా పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు అవస్థలు
గుంటూరు: ఏపీ పీజీ సెట్ నిర్వహణలో ఆది నుంచి జాప్యం చేస్తూ వచ్చిన ఉన్నత విద్యాశాఖ అధికారులు చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లోనూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూలైలో ఏపీ పీజీ సెట్ నిర్వహించారు. వారం పది రోజుల్లోపే ర్యాంక్ కార్డులను విడుదల చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అడ్మిషన్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఈనెల 8న విడుదల చేశారు. 8 నుంచి 15 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి 16 వరకు ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతోపాటు స్పెషల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 11న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. దీని ఆధారంగా ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సన్ (క్యాప్), దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేశామని, బుధవారం సాయంత్రం తమ వెబ్ సైట్ ద్వారా తెలియపరచామని యూనివర్సిటీ అధికా రులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడికి చేరుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అధికారులతో వాదనకు దిగిన విద్యార్థులు
యూనివర్సిటీ అధికారులు వెబ్‌సైట్‌లో ప్రకటించిన విషయాన్ని గుర్తించలేదని, ఇప్పుడు ఉన్న పళంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి వెనక్కు పంపడం తగదని విద్యార్థులు అధికారులతో వాదనకు దిగారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జీజీహెచ్ వైద్యాధికారులు అందుబాటులో లేరని, అందువల్ల వాయిదా వేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే వాయిదా వేయాలి గానీ, మిగిలిన వారివి యథావిధిగా నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు సులువుగా ఉంటుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని, మళ్లీ రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. హాజరైన విద్యార్థుల నుంచి అధికారులు మొక్కుబడిగా వారి పేర్లు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపు 100 మంది వరకు విద్యార్థులు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేశారనే విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చిన చాలామంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా పీజీ సెట్ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.