
వృద్ధ మహిళను ఇంటి నుంచి గెంటేశారు
నగరంపాలెం: ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఓ వృద్ధురాలు ఆరుబయట చీకట్లోనే ఉండిపోయింది. ఆర్టీసీ కాలనీ వెంకట్రావుపేట రెండో వీధిలోని ఓ ఇంట్లో 62 ఏళ్ల సంగీత సుధ ఉంటోంది. పైన ఆమెకు తెలిసిన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. సోమవారం రాత్రి ఆస్తి విషయంపై సుధతో వారు గొడవకు దిగారు. ఇంట్లోంచి బలవంతంగా ఆమెను బయటకు పంపేశారు. లోపలకు రాకుండా గేటుకు లోపల తాళాలు వేశారు. దీంతో చేసేది లేక సుధ ఇంటి ఎదుట ఓ కుర్చీలో కూర్చుండి పోయింది. ఇంటి ఆస్తికి సంబంధించి గొడవ కోర్టులో ఉందని, ఆస్తితో సంబంధం లేని వారు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయినట్లు తెలిపింది.