రైతుల సమస్యలపై కూటమి నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నేడు అన్నదాత పోరు

Sep 9 2025 8:34 AM | Updated on Sep 9 2025 1:10 PM

సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో రైతుల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందంటూ అధికారులు లెక్కలు వేసి మరీ చెబుతున్నా అవస్థలు తప్పడం లేదు. రైతు సేవా కేంద్రాలు, గిడ్డంగుల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు. డిమాండ్‌కు సరిపడా స్టాక్‌ క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కర్షకులు అగచాట్లు పడుతున్నారు. స్టాక్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు నో స్టాక్‌ అంటారోనని సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. రైతుల ఆవసరాలను అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారస్తులు బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు.

రాజకీయ పలుకుబడి ఉంటేనే ఎరువులు

ఎరువులకు రాజకీయ గ్రహణం పట్టింది. యూరియాకు సైతం రాజకీయ పలుకుబడి కావాల్సిన దుస్థితి గ్రామాల్లో చోటు చేసుకుంది. ఎరువుల బస్తాలు తమకు అనుకూలమైన వారికే ఇవ్వాలంటూ ఆయా గ్రామాల్లోని ఆర్‌ఎస్‌కే సిబ్బందిపై స్థానిక కూటమి నాయకులు కర్ర పెత్తనం చేస్తుండటంతో కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరి సాగు చేసిన పలువురికి యూరియా కట్టలు సకాలంలో అందని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌కే సిబ్బంది కూడా కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. ఓ వర్గం రైతులకే యూరియా కట్టలు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో స్టాక్‌ వచ్చిన గంటల వ్యవధిలోనే ఆర్‌ఎస్‌కే సిబ్బంది నో స్టాక్‌ అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక, బయట మార్కెట్లో దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.

కాగితాల మీద భారీగా లెక్కలు

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు 24,012 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 22,384.4 మెట్రిక్‌ టన్నులను సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ చిల్లర, టోకు వర్తకులతో పాటు మార్క్‌ఫెడ్‌ల వద్ద మరో 2,739.85 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో 4,100 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు రానుందని, ఈ నెల చివరిలోగా మరో 6,100 మెట్రిక్‌ టన్నులు వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

అరకొరగా పంపిణీ

తెనాలి నియోజకవర్గంలో యూరియా కష్టాలు తీరడం లేదు. రైతుకు అవసరం ఉన్నంత మేరకు ఇవ్వలేకపోతున్నారు. తెనాలి మండలానికి సంబంధింది 185 మెట్రిక్‌ టన్నులు, కొల్లిపర మండలంలో 80 టన్నుల యూరియా ఉంది. రోజుకు 50 మంది రైతులకు స్లిప్పులు ఇచ్చి అరకొరగా పంపిణీ చేస్తున్నారు. అదేమంటే రేపు మరికొంత వస్తుందని చెబుతున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. పొరుగున ఉన్న వేమూరు నియోజకవర్గానికి చెందిన రైతులు కూడా ఇక్కడకు వస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో యూరియా అమ్మడం లేదు. కంపెనీలు అధిక రేటు వసూలు చేయడం, ప్రతి కట్టకు ఒక నానో కట్ట తీసుకోవాలనే షరతులతో ప్రైవేటు ఎరువుల షాపుల వాళ్లు అసలు తీసుకోవడం లేదు. దీంతో ఆయా షాపుల్లో అమ్మకాలు లేవు. ప్రభుత్వ సొసైటీల పైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. కొల్లిపర మండలంలోనే ప్రైవేటు దుకాణాల్లో అమ్మకాలు లేవు. తెనాలిలో ప్రైవేట్‌ ఎరువుల దుకాణాలు కూడా సరిగా సప్లై చేయడం లేదు. దీంతో ఎరువుల కొట్ల బజార్‌లో దుకాణాలు వద్ద రైతులు ఎదురుచూస్తున్నారు

పచ్చ నేతల దారి మళ్లింపు

పొన్నూరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలు, మార్కెట్‌ యార్డులు, రైతు సేవా కేంద్రాల వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నా లభించని పరిస్థితి నెలకొంది. వచ్చిన యూరియాను కొంతమందికే ఇచ్చి మిగతావి పచ్చ నేతలు దారి మళ్లిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీలకు రాత్రి వేళ లారీల్లో వచ్చిన యూరియాను దిగుమతి చేసే సమయంలో కరెంట్‌ తీసి వంద కట్టలకు పైగా పక్కదారి పట్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల పనితీరుపై రైతులు మండిపడుతున్నారు.

బస్తాకు రూ. వంద అదనంగా వసూలు
తాడికొండ నియోజకవర్గంలో రైతులకు యూరియా దొరకడం లేదు. ప్రైవేటు దుకాణాల్లో బస్తాకు రూ. వంద అదనంగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులే గతంలో వచ్చిన యూరియా బస్తాలను నిల్వ చేసుకుని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. యూరియా బస్తాతో పాటు నానో యూరియా కొనాల్సిందేనని డిమాండ్‌ పెడుతున్నారు.

నేడు అన్నదాత పోరు
అన్నదాతల యూరియా కష్టాలపై వైఎస్సార్‌ సీపీ మంగళవారం జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాలవద్ధ నిరసన చేపట్టనుంది. కార్యక్రమంలో పార్టీ శ్రేణులతోపాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.

తెల్లవారుజాము నుంచే..
పొన్నూరు మార్కెట్‌ యార్డులో తెల్లవారుజాము నుంచే వందల సంఖ్యలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అనేక సొసైటీలు, ఆర్‌ఎస్‌ కేంద్రాల్లో ఇదే దుస్థితి. సామాన్య రైతులకు పక్కన బెడుతూ, సొసైటీల్లో పరపతి ఉన్న వారికే అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో యూరియా అందిన రైతుల నుంచి అరువు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్‌ డీలర్లు అధిక ధరలకు విక్రయించడంతో పాటు పురుగు మందులు కూడా తీసుకోవాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. సాగుకు యూరియా అందించలేని కూటమి ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement