
బకాయిల విడుదలకు ఏపీటీఎఫ్ ‘నిరసన వారం’
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘నిరసన వారం’ ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఎదుట ఉన్న సంఘ జిల్లా శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 15నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పటం లేదని, 30శాతం ఐఆర్‌పై కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు. అనవసరమైన యాప్స్ రద్దు చేయక పోగా పనిభారం పెంచే అస్సెస్మెంట్ బుక్లెట్స్ పెట్టడం పుండు మీద కారం చల్లినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఉపసంహరిచుకోవాలని మొర పెట్టుకునేందుకు విద్యాశాఖా మంత్రి అందుబాటులో లేకపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. 15 నెలలు వేచి చూశామని, అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులు రోజుకొక ఉద్యమ కార్యాచరణ నిరసన వారం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పి.లక్ష్మీనారాయణ, సత్యనారాయణమూర్తి, జి.దాస్, ముని నాయక్, షుకూర్, గురుమూర్తి, కృష్ణారావు, సుబ్బారావు, రాజ్ పాల్గొన్నారు.