
యూరియా సరఫరాలో కూటమి విఫలం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
నగరంపాలెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల తొమ్మిదో తేదీన తలపెట్టిన అన్నదాత పోరుబాటను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వర్తించారు. అంబటి మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని తెలిపారు. ప్రైవేటు దుకాణాల వద్ద యూరియా కోసం బారులుతీరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అప్రజాస్వామిక పరిపాలనతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ గొంతెత్తి ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేవారు. తురకపాలెంలో చిత్రమైన వ్యాధితో నలభై మంది మృత్యువాతకు గురయ్యారని, వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనలతోనే కూటమి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందని గుర్తు చేశారు. గ్రామ ప్రజలకు ఉచితంగా తాగునీరు, మౌలిక సౌకర్యాల కల్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే, రెండు రోజుల కిందట చద్ది అన్నం వడ్డించడంతో అక్కడ గ్రామ ప్రజలు వ్యతిరేకించారని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
●గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పక్షాన పోరాడేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. గుంటూరు కేంద్రంగా చేపట్టే అన్నదాత పోరుని చంద్రబాబు, పవన్‌కల్యాణ్, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఇద్దరు మంత్రులకు బలంగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
●పార్టీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి ఏపీలోని రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఈనెల 9న తలపెట్టిన అన్నదాత పోరు జయప్రదం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అంతా బ్లాక్‌మార్కెట్‌కు చేరడంతో రైతులకు అందడం లేదని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నాయకులు వలి వీరారెడ్డి, ఎన్.రాజేష్, పఠాన్ సైదాఖాన్, బత్తుల దేవా, సంఘాల నాయకులు పాల్గొన్నారు.