
ప్లీజ్.. టెండర్లలో పాల్గొన వద్దు !
టెండర్లు దక్కించుకునేందుకు
తెలుగు తమ్ముళ్ల పాట్లు
ఇటీవల అడ్డదారిలో దక్కించుకున్న వైనంపై సాక్షిలో కథనం
దాని ఆధారంగా పలువురిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అధికారులు
వర్కులను ఎలాగైనా దక్కించుకోవాలని వెంపర్లాడుతున్న తెలుగు తమ్ముళ్లు
టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ వాట్సాప్ మేసేజ్‌లు
నెహ్రూనగర్: అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహార శైలిపై గత నెల 22న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణకు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న వారి వివరాలు సేకరించి తనకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులకు చెప్పారు. కమిషనర్ ఆదేశంతో టెండర్లు రద్దు చేయడంతో పాటు పలువురిని ఇంజినీరింగ్ అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లాబోదిబోమంటున్నారు.
సగంలో ఆగిపోయిన వర్కులు
నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ లాభాలు వచ్చే వాటిని తెలుగు తమ్ముళ్లు బ్లాక్ చేసుకున్నారు. టెండర్లలో పాల్గొనకుండానే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి పనుల్ని దక్కించుకున్నారు. లెస్సుల్లో కూడా మాయాజాలం చూపి కోట్లాది రూపాయిల పనులిన్న కై వసం చేసుకున్నారు. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో, అడ్డదారిలో దక్కించుకున్న టెండర్లు రద్దు చేశారు. ప్రస్తుతం పనులు సగం వరకు పూర్తయ్యాయి. వాటిని ఆపేసి తిరిగి టెండర్లు పిలవాలని ఇంజినీరింగ్ అధికారులు నిర్ణయించడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.
చర్చనీయాంశంగా మారిన మెసేజ్
వర్కుకు ఎవరూ టెండర్ వేయవద్దంటూ టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ వాట్సాప్ గ్రూప్‌లో మేసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో ఓ డివిజన్‌లో 1.14కోట్ల రూపాయిల పనులపై ఎవరూ టెండర్ వేయవద్దంటూ వేడుకున్నాడు. వర్కులు గతంలో తనకు వచ్చాయని..కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయని..తిరిగి వాటికి టెండర్లు పిలిచినట్లు అందులో వాపోయాడు.
నేడు కలెక్టర్‌కు వినతి పత్రం
నగరపాలక సంస్థ అధికారులు కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారికే బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై మిగిలిన కాంట్రాక్టర్లంతా సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.