
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం
పిడుగురాళ్ల: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చంద్ర గ్రహణం పట్టిందని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ విమర్శించారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాయడం చంద్రబాబునాయుడు నైజం అని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబునాయుడు పాలన అంటేనే ప్రైవేటు వ్యవస్థకి కేంద్ర బిందువని అన్నారు. దాదాపు 15 సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగరా అని ప్రశ్నించారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలియజేశారు. వాటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనిపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అధికారపక్షంలో ఉండి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం ఆలోచనకు స్వస్తి పలకాలని ఆయన కోరారు.
వైఎస్సార్‌సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్