
చిట్టీల పేరుతో మోసగించారు
నగరంపాలెం: చిట్టీల పేరుతో మోసగించారంటూ కొందరు...అపహరణకు గురైన నగలు, నగదుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని మరికొందరు సోమవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అర్జీదారుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ స్వీకరించారు. బాధితుల మొర ఆలకించారు. ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చే ఫిర్యాదులను నిర్ణీత వేళల్లో పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరంగా విచారించి, బాధితులకు పరిష్కారం చూపాలని చెప్పారు. జిల్లా ఏఎస్పీలు రవికుమార్ (ఎల్/ఓ), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అరవింద్ (పశ్చిమ) కూడా అర్జీలు స్వీకరించారు.
పోస్టాఫీస్‌లో ఉద్యోగమని..
సుమారు రెండేళ్ల కిందట ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. పోస్టాఫీస్‌లో ఎంటీఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బాగా తెలుసునని, ఊరికి దగ్గర్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అడ్వాన్స్‌గా ఫోన్ పే ద్వారా రూ.2 లక్షలు చెల్లించాను. మిగతా రూ.4 లక్షలు ఉద్యోగంలో చేరాక ఇవ్వాలని బదులిచ్చాడు. ఇరవై లేదా 30 రోజుల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈలోగా ఓ నియామక లెటర్ పంపించగా, ఆ లెటర్ పోస్టాఫీస్‌లో చూపించగా, నకిలీ అని తేల్చారు. దీనిపై అతన్ని నిలదీయగా, మోసగించినట్లు ఒప్పుకున్నాడు. అప్పట్నించి డబ్బులు అడిగితే సరైన సమాధానంలేదు. అప్పు చేయగా వచ్చిన డబ్బులు అతనికి చెల్లించాను. – ఎస్.వెంకటరెడ్డి, సంగడిగుంట.
హోటల్ యాజమాని మోసం..
మూడేళ్ల కిందట ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు వచ్చాం. ఈ క్రమంలో అరండల్‌పేటలోని ఓ లాడ్జి/హోటల్‌లో ఉంటూ, ఆసుపత్రికి వెళ్లేవాళ్లం. దీంతో అక్కడ మేనేజర్ పరిచయమయ్యారు. అయితే తమ లగేజీలో దాచిన 240 గ్రాముల బంగారం, రూ.2.50 లక్షలు అపహరించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. దొంగిలించిన వ్యక్తి మేనేజర్ అని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాం. అప్పటి నుంచి మేనేజర్‌ని పిలిపిస్తామని కాలయాపన చేశారు. ఇప్పటికై నా అతన్ని పిలిచి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
– వై.కనకదుర్గ, కొరిటెపాడు.
తల్లి ఆచూకీ గుర్తించండి..
గత నెల 30న ఇంటి నుంచి తల్లి మణెమ్మ వెళ్లిపోయింది. నగర పరిసరాల్లో వెదికినా అమ్మ ఆచూకీ తెలియరాలేదు. ఇటీవల ఆర్టీసీ బస్టాండ్ సమీపాన ఓ సిటీ బస్‌లో ప్రయాణించినట్లు తెలిసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పటికై నా తల్లి ఆచూకీ గుర్తించాలని కోరుతున్నా.
– కుమారుడు శ్రీనివాస్, మూడో వీధి, రాజీవ్‌గాంధీనగర్,
తెలిసిన వారే చోరీ చేశారు.
ఈ ఏడాది జనవరిలో ఇంట్లోని బీరువాలో ఉన్న 150 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షలు దొంగలించారు. నగదు, నగలను తెలిసిన వారే తస్కరించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. అనుమానితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి, విచారణ చేసి పంపించారు. లోతుగా విచారణ చేపట్టడంలేదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా కేసు ముందుకు సాగడంలేదు. దాదాపు ఎనిమిది నెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగడంలేదు.
– షేక్.నమాజ్, నందులపేట, తెనాలి.
జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు నిర్ణీత వేళల్లో సమస్యలుపరిష్కరించాలని ఆదేశం
పదేళ్లుగా నమ్మకంగా ఉంటూ..
స్థానికంగా నివసించే ఓ కుటుంబం పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తోంది. అందరితో కలసిమెలసి ఉండే వారు. రూ.2 లక్షలు, రూ.3 లక్షల చిట్టీలు వేసేవారు. దీంతో వారి వద్ద చిట్టీలు వేయగా, చిట్టీ పాటలు ముగిసినా కూడా డబ్బులు చెల్లించడంలేదు. అంతేగాక డ్వాక్రా గ్రూప్ ద్వారా ప్రత్యేక రుణం తీసుకుని వాయిదాలు చెల్లించలేదు. మూడు వారాలుగా చిట్టీ నిర్వాహకులు కానరావడంలేదు. అదేమని అడిగితే పొంతలేని సమాధానాలు చెబుతున్నారు. దాదాపు 30 మందికిపైగా బాధితులు ఉన్నారు. సుమారు రూ.2.50 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఆర్థిక అవసరాల దృష్ట్యా అప్పులు తీసుకు వచ్చి, నెలనెలా చిట్టీల రూపేణా వారికి చెల్లించాం. న్యాయం చేయగలరు.
– బాధితులు, నెహ్రునగర్

చిట్టీల పేరుతో మోసగించారు