
కోర్టు పరిధి సమస్యలు అక్కడే తేల్చుకోండి
గుంటూరు వెస్ట్: కోర్టు పరిధిలో ఉన్న సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ వివాదాల్లో ఉన్న వాటిని తమ వద్దకు తీసుకురావద్దని కోరారు. అదేవిధంగా వ్యక్తిగత కక్షలతో పరిష్కారానికి వీలుకాని అర్జీలు కూడా స్వీకరించమన్నారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలు తమ అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయన్నారు. అనంతరం వచ్చిన 286 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్‌ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి