
మొక్కుబడి తంతు
బడి బస్సు భద్రమేనా..!
పట్నంబజారు: విద్యా సంస్థల బస్సుల భద్రతపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. పూర్తిస్థాయిలో భద్రత లోపభూయిష్టంగా మారిందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రవాణాశాఖ అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవటం అందుకు కారణం అవుతోందనే వాదనలు వినవస్తున్నాయి. విద్యా సంస్థల బస్సుల ఫిటెనెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ)కి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి.
ఎఫ్‌సీ జారీ ‘ప్రైవేటు’కు
రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారుల గణాంగాల ప్రకారం.. జిల్లాలో 1600 వరకు విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. గతంలో ఆర్టీఏ అధికారులు పూర్తిస్థాయిలో బస్సులను మ్యానువల్, సెన్సార్‌ల ప్రకారం తనిఖీలు నిర్వహించి ఎఫ్‌సీలు జారీ చేశారు. రూల్ నెంబర్ 185(ఎఫ్) కచ్చితంగా ప్రతి స్కూల్, కళాశాలల యాజమన్యాలు ఎఫ్‌సీలు తీసుకోవటంతో నిబంధనలు పాటించాలని తెలియజేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌సీ జారీ పక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జర్మనీ మిషన్‌లు, సెన్సార్‌ల ప్రకారం.. బస్సుల తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మిషనరీ ద్వారా కొద్దిపాటి తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో ఇంకా సుమారు 700కుపైగా బస్సులు ఎఫ్‌సీ చేయించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దీనిపై పలుమార్లు ఆర్టీఏ, ప్రైవేట్ ఎఫ్‌సీ సంస్థలను వివరాలు అడిగినప్పటీకీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే మిషనరీకి సంబంధించినవి మాత్రమే ప్రైవేట్ ఎఫ్‌సీ సెంటర్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారని, సుమారు 16 నిబంధనలు మ్యాన్యువల్ ప్రకారం చేయాల్సి ఉందని చెబుతున్నారు. సబ్‌రూల్ ‘ఏ’, ‘బి’ ప్రకారం తప్పని సరిగా పాటించాల్సిన మ్యాన్యువల్ పద్ధతులన్ని అధికారుల పర్యవేక్షణలో కొనసాగాల్సినవే.
నిబంధనలు..
● 60 సంవత్సరాలు వయో పరిమితి దాటిన వ్యక్తి విద్యాసంస్థల బస్సు డ్రైవర్‌గా అనర్హుడు
● డ్రైవర్‌కు హెవీ లైసెన్స్ ఉండి.. ఐదు సంవత్సరాల అనుభవం ఖచ్ఛితంగా ఉండాలి
● డ్రైవర్‌కు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు ఆయా యాజమాన్యాలు విధిగా చేయించి, ఆ రికార్డులను భద్రపరచాలి.
● డ్రైవర్‌ల నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తెలియపరచాలి
● ప్రతి వాహనంలో ఫిర్యాదు పుస్తకాన్ని ఏర్పాటు చేయాలి. బస్సులో అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం, బ్యాగులు భద్రపరుచుకునే బాక్సులు ఉండాలి.
● విద్యార్థుల వివరాలను యాజమాన్యాలు నోట్ చేసుకోవటంతో పాటు, తల్లిదండ్రులకు డ్రైవర్ వివరాలు తెలియజేయాలి.
● 15 సంవత్సరాలు దాటిన బస్సులకు అనుమతి ఉండదు.
● డ్రైవర్‌ల ప్రవర్తనపై దృష్టి సారించాలి.
● వీటిలో అనేక అంశాలు ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలోనే కొనసాగాల్సిన అవసరం ఉంది.
కనీస తనిఖీలు చేపట్టని ఆర్టీఏ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రైవేటు సంస్థకు అప్పగింత మాన్యువల్ పద్ధతులు ఆర్టీఓ పరిధిలోనే.. విద్యాసంస్థల బస్సులపై ఈ ఏడాది కేవలం 98 కేసులే జిల్లాలో 1600పైగా విద్యాసంస్థల బస్సులు మొద్దునిద్ర వీడకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం
బడి బస్సులపై కేసులు
సంవత్సరం కేసులు
2020–21 51
2021–22 545
2022–23 382
2023–24 145
2024–25 98
(జనవరి నుంచి ఇప్పటివరకు)
తనిఖీలు తూతూమంత్రం
విద్యా సంస్థల బస్సుల పర్యవేక్షణలో భాగంగా గతంలో అనేక కేసులు నమోదు అయ్యాయి. నిబంధనలు పాటించకుంటే బస్సులు సీజ్ చేసే అఽధికారం ఆర్టీఏ అధికారులకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు మరింతగా బడి బస్సుల భద్రతపై దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం తనిఖీలు తగ్గిపోయాయి. 2022లో జిల్లావ్యాప్తంగా బస్సులను తనిఖీలు చేసి, నిబంధనలు పాటించనివాటిపై 545 కేసులు నమోదు చేసిన అధికారులు ఈ ఏడాది 98 కేసులు మాత్రమే నమోదు చేయడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. ఇప్పటికై నా అధికారులు మేల్కొని ముమ్మర తనిఖీలు నిర్వహించి, బడి బస్సుల భద్రతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఏ పరీక్షలు చేస్తున్నారో మాకు తెలియదు
ప్రైవేట్ ఫిట్‌నెస్ సెంటర్‌లో ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారో.. మాకు కూడా తెలియదు. ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి పర్యవేక్షణ ఆదేశాలు రాలేదు. ఇంతవరకు ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ఫిట్‌నెస్ సెంటర్‌ను పరిశీలించింది లేదు. దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేం. బస్సులు నిబంధనలు పాటించకుంటే ఖచ్ఛితంగా చర్యలు తీసుకుంటాం.
– కె.సీతారామిరెడ్డి, డీటీసీ, గుంటూరు జిల్లా

మొక్కుబడి తంతు

మొక్కుబడి తంతు