ఆయన రూటే సపరేటు | - | Sakshi
Sakshi News home page

ఆయన రూటే సపరేటు

Aug 5 2025 6:39 AM | Updated on Aug 5 2025 6:39 AM

ఆయన రూటే సపరేటు

ఆయన రూటే సపరేటు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: మద్యం దుకాణాలపై ఆ ప్రజాప్రతినిధికి కోపమొచ్చింది. అడిగినంత ముడుపులు ఇవ్వలేదని గుర్రుగా ఉన్నారు. తన కోపాన్ని నేరుగా ప్రదర్శించలేక, ఆబ్కారీ అధికారులను అడ్డు పెట్టుకుంటున్నారు. ఏడాదిగా పత్తాలేని నిబంధనల కొరడా ఝళిపిస్తూ.. కప్పం కట్టని దుకాణదారులను తన దారిలోకి తెచ్చుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఒక దశలో ఆయా షాపుల ముందు తమ పార్టీ వారితో ధర్నాలు చేయించాలని ప్లాన్‌ చేశారు. కిందిస్థాయి నాయకులకు కూడా ఆదేశాలు ఇచ్చేశారు. అయితే ఎమ్మెల్యే మాట విని ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాల ముందు ధర్నాలు చేస్తే తాము బుక్‌ అయిపోతామని గ్రహించిన ‘తమ్ముళ్లు’ దీనిపై స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు వేచి చూద్దామంటూ సందేశం పంపారు.

● తొలుత మద్యం దుకాణాల్లో తనకు, తన అనుయాయులకు వాటాలు కావాలని పట్టుబట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కొందరు మాకు ఈ షాపులొద్దు.. ఈ వ్యాపారం వద్దు అంటూ దండాలు పెట్టాల్సి వచ్చింది. అనంతరం కుదిరిన ఒప్పందాల మేరకు మద్యం వ్యాపారులు దుకాణాల వద్దనే టెంట్లు వేసి అనధికారిక సిట్టింగ్‌లు ఏర్పాటు చేసి వ్యాపారాన్ని సాగిస్తున్నారు.

● ప్రభుత్వం మొదట మద్యం వ్యాపారులకు ఇస్తామన్న 20 శాతం కమీషన్‌ ఇవ్వకపోగా, దాన్ని తొమ్మిది శాతం, ఆపై పన్నెండు శాతానికి పరిమితం చేయడంతో లాభాలు కూడా రాని పరిస్థితి.

● ఇక ఆ ప్రజాప్రతినిధి ఒక్కో దుకాణం నుంచి కప్పం రూ.5 లక్షలు కట్టాలంటూ ఒత్తిడి తెచ్చారు. వారు మాట వినకపోవడంతో ఆబ్కా రీ అధికారుల ద్వారా రాయ ‘బేరం‘ పంపారు. అయినా దారికి రాలేదు. ఇంతలో మద్యం అసోసియేషన్‌ పేరుతో రాసిన లేఖతో ముడుపుల వ్యవహారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో విషయం బహిరంగమైంది.

● అసలే వ్యాపారం నష్టాల్లో నడుస్తుంటే ఐదు లక్షలు ముడుపులు ఏమిటని కొందరు వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. కొందరు మూడు లక్షలు ఇద్దామని సూచించగా, అందుకు కూడా విముఖత చూపారు. ఇక లాభంలేదని ఆ ప్రజాప్రతినిధి ఆబ్కారీ అధికారులను రంగంలోకి దింపారు.

అడిగినంత కప్పం కడితే సజావుగా వ్యాపారం లేదంటే ఆబ్కారీ అధికారులతో దాడులు బెంబేలెత్తుతున్న మద్యం వ్యాపారులు తన దారికి తెచ్చుకునేందుకు దుకాణలపై దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపణలు మాట వినని వారి షాపుల ముందు ధర్నాలకు ప్లాన్‌.. ముందుకు రాని తెలుగు తమ్ముళ్లు

వరుసగా తనిఖీలు.. ‘బెల్ట్‌’ పై దాడులు..

ముడుపులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న వ్యాపారులు మినహా, మిగిలిన వ్యాపారులను తన దారికి తెచ్చుకునేందుకు ఆ ప్రజాప్రతినిధి దాడులు చేయిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆబ్కారీ అధికారులు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న అధికారిక మద్యం దుకాణాలు, అనధికారిక బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా గుర్తుకురాని నిబంధనలు ఇప్పుడు అమలు చేయాలని కేసులు నమోదు చేయిస్తుండటం, దుకాణాల పక్కన ఉన్న టెంట్లు తొలగించాలని హుకుం జారీ చేస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మాట వినకపోతే తమ నాయకులతో ఆయా షాపుల వద్ద ధర్నాలు చేయించడానికి కూడా ప్లాన్‌ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement