
సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి
చేబ్రోలు: సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు గుర్తించి పరిష్కారానికి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు 3వ స్నాతకోత్సవం, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మొదటి స్నాతకోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ 3వ స్నాతకోత్సవం, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మొదటి స్నాతకోత్సవం సందర్భంగా 1,191 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను ఏకీకృతం చేయాలన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులందరికీ డిజైన్ చేయడం, డీబగ్ చేయడం, డిప్లాయ్ చేయగల త్రీడీ నైపుణ్యాలు ఇప్పుడు అత్యవసరమని అన్నారు. దేశంలో డిజిటల్ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయన్నారు. భారతావనికి ఇన్నోవేటర్ల అవసరం ఉందని, ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు. అందుకున్న విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చారు. వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, బోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్ సభ్యులు, డీన్లు, స్నాతకోత్సవ కన్వీనర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.