
ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసు
పొన్నూరు: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చేస్తున్న హత్యా రాజకీయాలు, అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం ఆనవాయితీగా మారిందని వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ధ్వజమెత్తారు. రాజకీయంగా టీడీపీని వ్యతిరేకించే వారిని అణచివేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే నరేంద్ర వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మన్నవ సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావుపై ఈ నెల 3వ తేదీన జరిగిన హత్యాయత్నమే ఇందుకు నిదర్శనం అన్నారు. పట్టణ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనపై నమోదైన అక్రమ కేసులో శనివారం అంబటి మురళీకృష్ణ పట్టణ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు సీఐ వీరా నాయక్ విచారించారు. అనంతరం అంబటి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడారు.
పదవి ఆశచూపి తప్పుడు ఫిర్యాదు
రెండు నెలల క్రితం మండలంలోని చింతలపూడి గ్రామంలో మినీ మహానాడు సభలో మీడియా, వందలాది కార్యకర్తల సాక్షిగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ అడ్డొచ్చిన వారిని భూస్థాపితం చేయాలంటూ నరేంద్ర చేసిన వ్యాఖ్యల కారణంగానే సర్పంచ్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. హత్యాయత్నం వీడియో, నరేంద్ర చేసిన ఆవేశ పూరిత వ్యాఖ్యల వీడియోలు మీడియా సాక్షిగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించాయని వెల్లడించారు. ఎమ్మెల్యే నరేంద్ర ప్రమేయంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ నాగ మల్లేశ్వరరావుపై టీడీపీ గూండాల దాడిని ప్రతి ఒక్కరూ ఖండించారని తెలిపారు. అయితే దీనిలో నరేంద్ర ప్రమేయం ఉందని తెలిసి ఏ టీడీపీ నేత కూడా ఈ దాడిని ఖండించలేదని గుర్తు చేశారు.
20 రోజులుగా నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమే తనపై ఈ అక్రమ కేసు అన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఆశ చూపి తనపై టీడీపీ పట్టణాధ్యక్షుడు అహ్మద్ ఖాన్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. నరేంద్ర మాట్లాడిన సభలోనే ఉండి కూడా ఆయన అనలేదని, వీడియో మార్ఫింగ్ అంటూ అసత్య ఆరోపణలతో ఫిర్యాదు చేసిన అహ్మద్ ఖాన్ అల్లాహ్‌కు సమాధానం చెప్పాలని అన్నారు.
ఎస్సీ, ముస్లిం, కాపు వర్గాలను పావులుగా వాడుతున్న ఎమ్మెల్యే
నరేంద్ర చేసే కుట్రలకు ఎస్సీలు, ముస్లింలు, కాపు వర్గాలను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మన్నవ సర్పంచ్‌పై దాడి కేసులో ఎమ్మెల్యే, ఆయన వర్గంతో పాటు నిందితులను తప్పించిన ఎస్‌ఐ కిరణ్‌పై కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ జరగనుందని అన్నారు. ఇటీవల వడ్డిముక్కల గ్రామంలో కాలం చెల్లిన సంగం పెరుగు అని ప్రశ్నించినందుకు కాపు వర్గానికి చెందిన యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయించడం దుర్మార్గం అన్నారు. ఇలా అనేక అరాచకాలకు పాల్పడ్డారని, భవిష్యత్తులో అన్నింటిపై చర్యలు ఎదుర్కోక తప్పదని అన్నారు. ఈ అక్రమ కేసులో పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చారని, వీడియో ఆధారంగా ఎమ్మెల్యే నరేంద్ర చేసిన వ్యాఖ్యలలో నిజం ఉందని స్పష్టం చేశారు. పొన్నూరు ప్రజల కోసం ఎలాంటి కేసులైనా తాను ఎదుర్కొంటానని అన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నేతలురోళ్ల మాధవి,షేక్ సైఫుల్లా, ఆకుల వెంకటేశ్వరరావు, చింతలపూడి మురళీకృష్ణ, షేక్ నాజర్, షేక్ మాము, అమిరినేని సాంబశివరావు, రుద్రపాటి ఆదిశేషు, అంబటి వెంకటేశ్వరరావు, లంకపోతు పిచ్చిరెడ్డి, షేక్ మౌలాలి ఉన్నారు .
వాస్తవ వీడియోను మార్ఫింగ్
అనడం సిగ్గుచేటు
మినీ మహానాడులో కార్యకర్తలు,
మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలవి
అనలేదనడం పిరికిపంద చర్య
నాపై ఫిర్యాదు చేస్తేనే మార్కెట్ యార్డు
పదవి అంటూ టీడీపీ నేతకు ఎర
ఎమ్మెల్యే నరేంద్ర అరాచకాలను
గమనిస్తున్న ప్రజలు
వైఎస్సార్‌సీపీ పొన్నూరు
సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
పోలీసుస్టేషనులో విచారణకు హాజరు