
‘పాస్‌పోర్ట్’ విచారణ సేవల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
నగరంపాలెం: పాస్‌పోర్ట్ దరఖాస్తుల విచారణ సేవల్లో రాష్ట్రంలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖకు ద్వితీయ స్థానం లభించడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో శనివారం ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి శివహర్ష నుంచి అవార్డును జిల్లా స్పెషల్ విభాగం (ఎస్‌బి) సీఐ అలహరి శ్రీనివాస్ స్వీకరించారు. అనంతరం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన్ను జిల్లా ఎస్పీ అభినందించారు. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు 30 వేలకుపైగా పాస్‌పోర్ట్ దరఖాస్తులను విచారణ పూర్తి చేయడంపై రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం లభించింది.
చెస్ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాలకు బహుమతి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్‌లోని 17 మెడికల్ కళాశాలలతో జూలై 22 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఇంటర్ మెడిక్స్ చెస్ పోటీల్లో గుంటూరు మెడికల్ కళాశాల విద్యార్థులు మూడో బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి విజేతలను అభినందించారు. ఇంటర్న్ డాక్టర్ ఆశాదేవి, ఎంబీబీఎస్ విద్యార్థినులు సమదర్శిని, రిన్సీ దీపికలకు డాక్టర్ సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుందరాచారి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఇది సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందన్నారు.
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 1516 క్యూసెక్కులు శనివారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ నుంచి రేపల్లె కాలువకు 126 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 262, పశ్చిమ కాలువకు 120, నిజాపట్నం కాలువకు 235, కొమ్మూరు కాలువకు 110 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజి నుంచి సముద్రంలోకి 10,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
581 అడుగులకు చేరిన
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.30 అడుగులకు చేరింది. ఇది 286.7635 టీఎంసీలకు సమానం. జలాశయం నుంచి కుడి కాలువకు 511, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి జలాశయానికి 1,20,339 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
రూ.2.75 కోట్ల విలువైన
20 పనులకు పౌడా ఆమోదం
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.2.75 కోట్లతో చేసే 20 పనులకు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ కమిటీ (పౌడా) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శనివారం కలెక్టరేట్‌లో పౌడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన అభివృద్ధి, ప్రణాళికా కార్యకలాపాలపై అథారిటీ నాలుగవ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు అజెండాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. దీనిలో అథారిటీ సభ్యులు డీటీసీపీ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సునీత, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ టి.రవీంద్రబాబు, ఏపీ సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.రాంబాబు, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, కాలుష్య నియంత్రణ మండలి విభాగ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర కార్యదర్శి ఎం.నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

‘పాస్‌పోర్ట్’ విచారణ సేవల్లో జిల్లాకు ద్వితీయ స్థానం

‘పాస్‌పోర్ట్’ విచారణ సేవల్లో జిల్లాకు ద్వితీయ స్థానం

‘పాస్‌పోర్ట్’ విచారణ సేవల్లో జిల్లాకు ద్వితీయ స్థానం