అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయిన లారీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట నుంచి సీతానగరం వచ్చే మార్గంలో బకింగ్‌హామ్ కెనాల్ వద్ద ఉన్న రైల్వే అండర్‌పాస్‌లో మరోసారి భారీ వాహనం ఆదివారం ఇరుక్కుపోయింది. సీతానగరం నుంచి ఎన్టీఆర్ కరకట్ట వైపు వెళుతున్న లారీ రైల్వేబ్రిడ్జి సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్‌ను దాటి ముందుకు వచ్చేసింది. బ్రిడ్జి కిందకు రాగానే లారీపై ఉన్న లోడ్ బ్రిడ్జికి తగిలి ఇరుక్కుపోవడంలో లారీ డ్రైవర్ లారీని నిలిపివేశాడు.
చివరకు టైర్లలో గాలి తీసి ఆ లారీని ముందుకు తీసుకువెళ్లారు. ఈ రైల్వే బ్రిడ్జి కింద తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జికి ప్రమాదం కలగకుండా బ్రిడ్జికి సమాంతరంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జరిగిన ఈ సంఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.


