
పాత గుంటూరు: గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలు గుంటూరు నగరానికి ఒక అద్భుత రసానుభూతిని పంచుతున్నాయి. ప్రాథమిక దశ ఎంపికలు పారదర్శకంగా ఉండటంతో ప్రతిభావంతమైన నటనాశక్తి ఉన్న నటీనటులతో ప్రేక్షక జనరంజక అంశాలతో రూపొందిన నాటకాలు, నాటికలు పోటీ ప్రదర్శ లలో రంగస్థలం మీద రంగులీనుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ కృషి ప్రదర్శల నిర్వహణలో కనిపించింది. ఈ ప్రదర్శనలలో మూడోరోజు సోమవారం రెట్టించిన ఉత్సాహంతో చూపరులందరినీ ఆకట్టుకున్న ప్రదర్శలు దేనికదే తమ ప్రత్యేకతలను చాటుకున్నాయి. చైర్మన్ పోసాని కృష్ణ మురళి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రదర్శనలలో తొలిగా సవేరా ఆర్ట్స్ సంగీత సాహిత్య నాటక సంస్థ కడప వారు సమర్పించిన ‘‘శ్రీరామ పాదుకలు’’ పౌరాణిక పద్య నాటకం ప్రదర్శితమైంది. రామాయణం పాదుకా పట్టాభిషేక ఘట్టం ఈ నాటక ప్రధాన ఇతివృత్తం. భరతుని సోదర భక్తికి, శ్రీరాముని ధర్మనిరతిని ప్రతిబింబించేలా నాటకంలో ఈ ఘట్టాన్ని చిత్రించిన తీరు చాలాబాగుంది. ఈ నాటకాన్ని లక్ష్మీ కులశేఖర్ రచించారు. ఆళ్ళూరి వెంకటయ్య దర్శకత్వం వహించారు.
చక్కని గుణపాఠం
మంచి (గుణ) పాఠం చెప్పిన నాటికను డాక్టర్ పి.వి.ఎన్.కృష్ణ రచించారు. పి. సాయిశంకర్ దర్శకత్వం వహించారు. శ్రీరామా ఇంగ్లిషు మీడియం హైస్కూలు విజయవాడ బాలలు దీన్ని ప్రదర్శించారు. బాలకళాకారులు తమ నటనను నిరూపించుకున్న బాలల నాటిక ఇది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా బాల కార్మిక వ్యవస్థను రూపు మాపలేక పోవటం విచారకరమని, దానికి ఏంచేస్తే బాలలందరికీ ఉజ్వల భవిత దక్కుతుందో చూపిన నాటిక ఇది.
ఝనక్ ఝనక్ పాయల్ బాజే నాటకం
బండల పక్కన ఏరు. ఏరు పక్కన ఊరు. ఊరుకొక్క పోరు అంటూ పోరాటాలు, ఆరాటాలు వీటంన్నిటి నేపథ్యంలో ప్రపంచానికి పోరాటం నేర్పిన కళాకారుడు పరిస్థితి తనదాకా వస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని ఝనక్ ఝనక్ పాయల్ బాజే నాటిక చూపించింది. ఎంఎస్ చౌదరి రచన దర్శకత్వంలో తెనాలి కళల కాణాచి వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.
నిశ్శబ్ధమా....నీ ఖరీదెంత?
విశాఖపట్నం తెలుగు కలా సమితి నిర్వహణలో.పి.టి.మాధవ్ నాటకీకరణలో చలసాని కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఇది ప్రదర్శితమైంది. ప్రస్తు త సమాజంలో కొన్ని వివాహాల అనంతరం యు వతీ యువకుల్లో తలెత్తుతున్న అవగాహనా రాహి త్యాలు, వివాహేతర సంబంధాలు, మంచికోసం రూపొందించిన చట్టాలను అడ్డుపెట్టుకుని కొందరు చేస్తున్న అనైతిక కార్యాలవల్ల నష్టపోతున్న వారి జీవిత గాథలను ఈ నాటిక చూపించింది.
ఆలోచింపచేసిన ఇంకెన్నాళ్లు
ఇది ‘దిశ’ యధార్థ కథ ఆధారంగా రూపొందిన నాటిక. అనంతపురం ఎస్‌ఎస్బిఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఆముదాల సుబ్రహ్మణ్యం రచన దర్శకత్వాలలో ఈ నాటికను ప్రదర్శించారు. దిశ అత్యాచారం, ఎన్‌కౌంటర్ తర్వాత వారి ఆత్మల పశ్చాత్తాపం, దిశ కోపాన్ని నాటకీకరించి ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించి చక్కని సందేశమిచ్చారు.
నాటిక కమనీయం
కళాకారుడు తన వారసత్వాన్ని మరో కళాకారుడికి అందిస్తున్నట్లే కళా హృదయులు కూడా తమ కళాభిమానాన్ని భావితరాలకు పరిచయం చేయాలని చెబుతూ ప్రదర్శించిన కమనీయమైన నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుంటూరు సద్గురు కళానిలయం నిర్వహణకు విద్యాధర్ మునిపల్లె రచనకు, బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించారు.
గుంటూరులో వైభవంగా
నంది నాటక ప్రదర్శనలు
ఉత్సాహంగా సాగుతున్న
నాటకోత్సవం
మూడో రోజు ఏడు నాటక, నాటిక ప్రదర్శనలు
పర్యవేక్షించిన పోసాని కృష్ణ మురళి
జరుగుతున్న కఽథ..
పిల్లల ఆర్ధిక పరిపుష్టికి తమ అవసరాలను కూడా పక్కనపెట్టి శక్తి యుక్తులన్నీ ధారపోస్తారు తల్లిదండ్రులు, పిల్లల ఆదరాభిమానాలకు దూరమై, అవమానాలకు గురైన తీరును జరుగుతున్న కఽథగా చూపించారు. తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారు. వల్లూరు శివప్రసాద్ రచనకు, గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు.
నేటి నాటక ప్రదర్శనలు ఇవే..
1. ఉదయం 9:30 గంటల నుంచి కాకినాడ శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి నిర్వహణలో శ్రీ నాగ శ్రీ రచనకు, అన్నపు దక్షిణామూర్తి దర్శకత్వంలో సీతా కళ్యాణం (పద్య నాటకం)
2. మధ్యాహ్నం12:30 గంటల నుంచి కొండపల్లి కథనం క్రియేషన్స్ క్రాంతి కాన్వెంట్ హై స్కూల్ నిర్వహణలో శ్రీ కవి పి.ఎన్.ఎం.రచనా, దర్శకత్వంలో తథా బాల్యం (బాలల నాటిక)
3. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాదు మిత్ర క్రియేషన్స్ వారి ఆకురాతి భాస్కర్ చంద్ర రచనకు ఎస్‌ఎం భాష దర్శకత్వంలో ది ఇంపోస్టర్స్ (సాంఘిక నాటకం)
4. సాయంత్రం 4:30 గంటల నుంచి విజయవాడ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, సిద్ధార్థ మహిళా కళాశాల సంయుక్త నిర్వహణ లో ఎన్.ఎస్. నారాయణ బాబు రచనకు శ్రీ వాసు దర్శకత్వంలో ఇంకానా (కళాశాల విశ్వవిద్యాలయాల నాటిక)
5. సాయంత్రం 6 గంటల నుంచి పెద కాకాని గంగోత్రి వారి పిన్నమనేని మృత్యుంజయరావు రచనకు నాయుడు గోపి దర్శకత్వంలో అస్తికలు (సాంఘిక నాటిక)
6. రాత్రి 7:30 గంటల నుంచి కర్నూలు లలిత కళ సమితి నిర్వహణలో పల్లెటి లక్ష్మీ కులశేఖర్ రచనకు, పత్తి ఓబులయ్య దర్శకత్వంలో శ్రీకష్ణ కమలపాలిక (పద్య నాటకం)
కళాభిమానులతో నిండుగా ప్రాంగణం
ప్రాచీన కళలు అంతరించి పోతున్నాయనుకున్న తరుణంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న నాటకోత్సవాలు నాటక రంగానికి జీవం పోశాయి. ఈ ప్రదర్శనలతో విజ్ఞాన మందిరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సందడి నెలకొంది. ప్రేక్షకులు నాటకాలను వీక్షించేందుకు గంటల తరబడి కుర్చీలకు పరిమితమయ్యారు. చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. చప్పట్లతో కళాకారులను ప్రోత్సహించడం చాలా సంతోళాన్ని కలిగించింది.
–కానూరు నాగేశ్వరి, టిడ్కో హౌసింగ్ డైరెక్టర్
ఉత్సాహంగా ప్రదర్శనలు
రాష్ట్రస్థాయిలో కళాకారులు గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంది నాటకోత్సవాలకు రావాలంటేనే ఇష్టపడలేదు. అప్పట్లో నాటక ప్రదర్శనలు సంతృప్తికరంగా సాగలేదు. సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి కష్టపడే ఏ కళాకారుడికీ అన్యాయం జరగకూడదని కళాకారుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా తోడ్పాటునందించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం ఏసీ హోటల్‌లో వసతి కల్పించాం. సకల మర్యాదలతో కళాకారులను గౌరవిస్తున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27 మంది సీనియర్ కళాకారులు ఈ ప్రదర్శనలకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదర్శన యుగియగానే బృందానికి అధిక మొత్తంలో నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం, దీంతో కళాకారులు ఇన్నాళ్లుగా ఉన్న నిరుత్సాహాన్ని వీడి ఉత్సాహంగా ప్రదర్శనలిస్తున్నారు. ఎన్నడూలేని విధంగా విజ్ఞానమందిరం కళాభిమానులతో నిండుగా కనిప్తోందని స్ధానిక ప్రజలే చెబుతున్నారు. రానున్న రోజుల్లో ప్రోత్సాహకాలను రెండింతలు చేసి అందిస్తాం.
–పోసాని కృష్ణ మురళి, చైర్మన్. చలనచిత్ర టీబీ, నాటక రంగ అభివృద్ధి సంస్ధ

