జిల్లా కలెక్టర్‌కు గవర్నర్ ప్రశంసలు
గుంటూరు వెస్ట్: సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుంచి రూ.17,67,363 సేకరించారు. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తొలి స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. సైనికుల త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. సైనిక కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. గ్రామ, మండల స్థాయి నుంచి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పర్యావరణంలో అవకాశాలు’ అనే థీమ్‌తో నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని శాఖలు సమర్థంగా ప్రణాళికతో, సమన్వయంతో కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్య విలువలను ప్రోత్సహించేందుకు ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.


